అందమైన చిత్రాలను... కదిలేలా చేస్తూ వాటికి ప్రాణం పోస్తాడు చేతన్ కుమార్ రెడ్డి. తిరుపతిలోని కాకతీయనగర్‌కు చెందిన కుర్రాడు. నగరంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో 2018లో బీటెక్ పూర్తి చేసిన చేతన్‌కు దర్శకత్వం, యానిమేషన్ అంటే మక్కువ ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే సెల్ఫోన్లతో లఘుచిత్రాలు తీయడం ప్రారంభించాడు. స్నేహితులే కెమెరాను కొనిచ్చి ప్రోత్సహించారు. అలా ఏడేళ్లుగా దర్శకత్వం, ఎడిటింగ్, యానిమేషన్, సినిమాటో గ్రాఫర్ ఇలా విభిన్న రంగాల్లో చేతన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు తిరుపతి విశిష్ఠతను చెప్పేందుకు సిద్ధమయ్యాడు.
కరోనా మహమ్మారి కారణంగా.. ప్రభుత్వం విధించిన ఆంక్షలతో లఘు చిత్రాలను తీసేందుకు అవకాశం లేకపోవటంతో తనకు దొరికిన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించాడు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్యం, కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవారి ఆలయ చరిత్రలో ప్రజలకు పెద్దగా తెలియని విశేషాలను కథలుగా మలిచే ప్రయత్నం ప్రారంభించాడు. చిత్రకారిణి పవిత్రతో కలిసి తాను అనుకున్న అంశాలను చర్చించాడు. తిరుమల ధ్వజ స్తంభం పున:ప్రతిష్ఠ, తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో విగ్రహం వెనకున్న విశేషాలను...అందమైన చిత్రాలుగా మలిస్తే...వాటికి చేతన్ తన యానిమేషన్ ప్రతిభతో ప్రాణం పోశాడు. యునైటెడ్ తిరుపతి అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. లాక్ డౌన్ సమయంలో చేసిన వీడియోలను పోస్ట్ చేయగా.. పలువురు చరిత్రకారులు, శ్రీవారి భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు చేతన్‌పై ప్రశంసలు కురిపించారు.