పల్లెదనం ఉట్టిపడే జానపద చిత్రాలు...ఆధ్యాత్మికత కలిగించే దేవతా చిత్రాలు...ఊహలకు రెక్కలు తొడిగి గీసే ప్రకృతి అందాలు...ఇలా వేటినైనా అబ్బుర పరిచేలా సృష్టిస్తున్నాడు తిరుపతికి చెందిన ఆముదాల కల్యాణ్. చిత్రకళలో ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు.
సెలవుల్లో మెళకువలు..
స్ట్రక్చరల్ ఇంజనీర్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు కల్యాణ్... ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో తనలో నిద్రిస్తున్న చిత్రకళను తట్టిలేపాడు. అంతర్ కళాశాల పోటీలలో పాల్గొనేవాడు. తోటి విద్యార్థులు, అధ్యాపకుల అభినందనలతో పెయింటింగ్‌పై మక్కువ పెంచుకొన్నాడు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరులోని రేవా ఇనిస్టిట్యూట్‌లో చేరిన ఈ యువకుడు... చదువు కొనసాగిస్తూనే ఫైన్ ఆర్ట్స్ పై దృష్టి సారించాడు. చిత్రకళలో మెళకువలను నేర్చుకొన్నాడు. అలా పీజీ పూర్తయ్యేలోపు ఓ స్థాయి చిత్రకారుడైన తనను... కరోనా మహమ్మారి మరో స్థాయికి చేర్చిందని చెప్పాడు కల్యాణ్. లాక్‌డౌన్ సమయంలో చిత్రకళలోని రకాలను అంతర్జాలంలో వెతికి పట్టుకొని తన కళకు మెరుగులు దిద్దుకున్నానని తెలిపాడు.