Amaravathi Farmers Sabha: ఆధ్యాత్మిక నగరం తిరుపతి ‘జై అమరావతి’ నినాదంతో దద్దరిల్లింది. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ధారపోసిన రైతుల సుదీర్ఘ పాదయాత్రకు వేంకన్న సన్నిధిలో బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా సభకు పోటెత్తిన ప్రజానీకం.. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్న ఆకాంక్షకు అద్దం పట్టింది. మరోవైపు అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తెచ్చింది. మూడు రాజధానులంటూ దోబూచులాడుతున్న ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది.
‘అమరావతే ఏకైక రాజధాని’ అనే నినాదంతో..
తెదేపా, భాజపా, కాంగ్రెస్, జనసేన, సీపీఐ .. ఇలా విపక్ష నేతలందరూ ‘అమరావతే ఏకైక రాజధాని’ అని ముక్తకంఠంతో నినదించారు. ప్రతిపక్ష నేత హోదాలో అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు తేల్చిచెప్పారు.
వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... రాష్ట్ర ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గర్జించారు. నామరూపాలు కోల్పోయిన తమ పంట భూముల మాదిరే రాష్ట్ర ప్రజల ఆశలు గల్లంతయ్యాయని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చి, తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో రాష్ట్ర, దేశ దృష్టిని ఆకర్షించారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా ప్రజలు పెద్దసంఖ్యలో సభకు తరలివచ్చి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. సభ జరుగుతున్నంతసేపు జై అమరావతి నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని.. అమరావతే మన రాజధాని అంటూ నినదించారు. సభికులంతా ఆకుపచ్చ కండువాలు, టోపీలు ధరించారు. సభా ప్రాంగణంలో ఉదయం నుంచే కోలాహలం నెలకొంది. తిరుపతిలోని రామానాయుడు కల్యాణ మండపం వద్ద బస చేసిన పాదయాత్రికులు అందరికంటే ముందే అక్కడికి చేరుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా బారికేడ్లను ఏర్పాటు చేయించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సభ ప్రారంభానికి ముందు తిరుపతి పశ్చిమ డీఎస్పీ నర్సప్ప వేదికపైకి వచ్చి ఐకాస నేతలతో మాట్లాడారు. గణపతి పూజతో సభను ప్రారంభించారు. తర్వాత హిందు, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రతినిధులు ప్రార్థనలు చేశారు. ముందుగా అమరావతి రైతులు తమ కష్టాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తే తమకు లాఠీ దెబ్బలు మిగిలాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ ఉద్వేగానికి లºనయ్యారు.
పాటకు పరవశించి...
సభ ప్రాంరంభానికి ముందు కళా బృందాల నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. ఇదే సమయంలో ‘రాజధాని అమరావతి ఆంధ్ర ప్రజల ఊపిరి’’ అంటూ కళా బృందం సభ్యులు నృత్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సభలోని వారంతా నిల్చుని చేతిలో ఆకుపచ్చ కండువాలు ఊపుతూ ఉత్సాహపర్చారు. ఇదే సమయంలో సభావేదికపై ఆశీనులైన నేతలు కూడా అమరావతికి జై అంటూ నినాదాలు చేశారు. సభా ప్రాంగణం మొత్తం ఆకుపచ్చని కండువాల రెపరెపలతో కళకళలాడింది.
వైకాపా నుంచి రఘురామ హాజరు
సభకు అధికార వైకాపా మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఐకాస నేతలు చెబుతున్న సమయంలో తాను వచ్చినట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. సీపీఐ నారాయణ, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించారు. రఘురామకృష్ణంరాజు, చంద్రబాబులు ఆలింగనం చేసుకున్నారు. ఇదే సమయంలో వేదికపైకి ఎక్కే సమయంలో చంద్రబాబు.. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పలుకరించారు. అంతకుముందు సభా వేదికపైకి వచ్చే ముందు చంద్రబాబునాయుడు శ్రీవారి రథం వద్దకు వెళ్లి దండం పెట్టుకున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వక్తలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన కేవలం సుమారు 15 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాయంత్రం 6 గంటలలోపే తాను ప్రసంగాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా అమరావతి కరకట్ట దాటి తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతం కావడం పట్ల ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.