జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం.. 62 ఎకరాల స్థలం కేటాయిస్తూ.. అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మూ జిల్లా మజిన్ గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిమిత్తం కేటాయించింది. ఈ స్థలాన్ని 40 ఏళ్లపాటు తితిదేకు లీజుకు ఇవ్వడానికి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ రోజు ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన.. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశమై ఈ అంశంపై నిర్ణయం తీసుకుంది.
తితిదేకు కేటాయించిన స్థలంలో వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, కార్యాలయాలు, యాత్రికుల సౌకర్య సముదాయాలు, నివాస గృహాలు, పార్కింగ్ వసతులు ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. దేవాలయాల నగరంగా పేరున్న జమ్మూలో తితిదే కార్యకలాపాలతో పర్యటకం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలు సైతం మెరుగుపడే అవకాశం ఉందన్నారు.