ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో సులభతరంగా గదుల కేటాయింపు

తిరుమలలో ఇకపై సులభంగా గదులు పొందేలా తితిదే మార్పులను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా.. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, టోల్‌గేట్‌, శ్రీవారి మెట్టు వద్ద గదుల రసీదుల స్కానింగ్‌ కేంద్రాలను సోమవారం ప్రారంభించింది.

rooms in tirumala
తిరుమలలో సులభతరంగా గదుల కేటాయింపు

By

Published : Apr 20, 2021, 7:03 AM IST

ఆన్‌లైన్‌లో ముందస్తుగా అద్దె గదులను బుక్‌ చేసుకున్న యాత్రికులకు తిరుమలలో ఇకపై సులభంగా గదులు పొందేలా తితిదే మార్పులను తీసుకువచ్చింది. అందులో భాగంగా తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, టోల్‌గేట్‌, శ్రీవారి మెట్టు వద్ద గదుల రశీదుల స్కానింగ్‌ కేంద్రాలను సోమవారం ప్రారంభించింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో గదులు ముందస్తు బుకింగ్‌ చేసుకున్న యాత్రికులు మొదట సీఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ స్కాన్‌ చేసుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉప విచారణ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు. దీని వల్ల సమయం వృథా అవుతోందని యాత్రికులు తితిదేకు విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై తితిదే స్పందించి ఈ చర్యలు చేపట్టింది. ఇక నుంచి తిరుపతి నుంచి కాలినడకన వచ్చే యాత్రికుల కోసం అలిపిరి పాదాల మండపం, శ్రీవారి మెట్టు వద్ద, వాహనాల్లో వచ్చేవారి కోసం అలిపిరి టోల్‌గేట్‌ వద్ద స్కానింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్కాన్‌ చేయించుకున్న కొంత సమయానికే రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు సబ్‌ ఎంక్వైరీ కార్యాలయ వివరాలను పంపుతారు. దాంతో నేరుగా కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చు. అలాగే త్వరలో తిరుమలలోని సీఆర్వో కార్యాలయాన్ని వికేంద్రీకరించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాట్‌మెంట్‌ కేంద్రాలను సబ్‌ ఎంక్వైరీ కార్యాలయాలకు తరలిస్తారు.

ABOUT THE AUTHOR

...view details