తిరుపతి ఉపపోరు ప్రచారంలో పార్టీలు వేగం పెంచాయి. అధికార వైకాపా తరఫున మంత్రులు, పార్టీ బాధ్యులు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. ప్రతిపక్షాలు కూడా ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైకాపా అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా.. పార్టీ బాధ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణస్వామి, గౌతంరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతిపక్షాలు మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులకు టిక్కెట్టు ఇస్తే.. వైకాపా మాత్రం ఓ సాధారణ కార్యకర్తని బరిలో నిలిపిందన్న వైవీ సుబ్బారెడ్డి.. గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
తెదేపా విస్తృత ప్రచారం...
అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడంతోపాటు నామినేషన్ ఘట్టాన్ని పూర్తిచేసిన తెలుగుదేశం.. ప్రచారాన్ని విస్తృతం చేసింది. రాష్ట్ర స్థాయి నేతలు తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉప ఎన్నికల బాధ్యుడిగా తిరుపతిలోనే మకాం వేయగా.. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో స్థానిక నేతలు జోరుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థి పనబాక లక్ష్మి.. స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.