ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపపోరు: సమీపిస్తున్న పోలింగ్... ప్రచారానికి పదును..! - Election Campaign

పోలింగ్ సమయం దగ్గరపడుతున్నకొద్దీ తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం హాట్​హాట్​గా మారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కీలక కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే... తాము గెలిస్తే ఏం చేస్తారో చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువ. వారే నిర్ణేతలు. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు, అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు.

ప్రచారానికి పదును
ప్రచారానికి పదును

By

Published : Apr 1, 2021, 10:07 PM IST

తిరుపతి ఉపపోరులో విజయం కోసం ప్రధాన పార్టీలు కదన రంగంలోకి దిగాయి. ప్రచారానికి పదును పెట్టాయి. ఓటర్లను ఆక్టటుకునేందుకు ఒక్కోపార్టీ ఒక్కోవిధంగా ప్రచారం చేస్తోంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. విజయాన్ని నిర్ణయించేది వారే కాబట్టి... అతివలకు దగ్గర కావడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తెదేపా, భాజపా తమ పార్టీ తరఫున మహిళా అభ్యర్థులనే ప్రకటించి... ఇప్పటికే దగ్గరైందనే చర్చ జరుగుతోంది.

రత్నప్రభను గెలిపిస్తే... ఏపీ నుంచీ ఓ కేంద్రమంత్రి..!

తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని... తమ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారని భాజపా ప్రచారం చేస్తోంది. రాజకీయాలకు కొత్తైనా... సుదీర్ఘకాలం ఐఏఎస్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భాజపా రాష్ట్ర నాయకత్వం తిరుపతిలో మోహరించి... ప్రచారం వ్యవహారాలు చూస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లేలా ఆ పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నారు. జనసేన అధినేత పవన్​ను సీఎం చేస్తామన్న ప్రకటనతో.. ఆ పార్టీ శ్రేణులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అతి సామాన్యుడు మా అభ్యర్థి...

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా... తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి, ఆధిక్యాన్ని పెంచుకోవడానికి గట్టిగా కృషి చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రచారానికి రానని తేల్చి చెప్పడంతో... బాధ్యతలు తీసుకున్న ఏడుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ పార్టీ సామాన్య వ్యక్తిని అభ్యర్థిగా నిలెబట్టిందని ప్రచారం చేస్తున్నారు. పుర, పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన జోష్​లో ఉన్న వైకాపా శ్రేణులు... తమ పార్టీ అభ్యర్థిని విజయతీరానికి చేర్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'గడపగడపకూ వైకాపా' పేరుతో... ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, జగన్​నే ప్రధానంగా ప్రచారంలో వాడుతున్నారు.

దూకుడు పెంచిన తెదేపా..

అందరికంటే ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించిన తెదేపా... ప్రచారంలో దూకుడు పెంచింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించి... మహిళా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ప్రచారంలో పనబాక... ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆమెకు తెదేపా రాష్ట్ర నాయకత్వం అండగా నిలుస్తూ... ప్రచారంలో పాల్గొంటోంది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, అమర్నాథ్​రెడ్డి.. నాయకులు, కార్యకర్తలను కలుపుకొని విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. అనుభవం, ప్రశ్నించే గొంతుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అటు సోషల్ మీడీయాలోనూ తెదేపా యాక్టివ్​గా ప్రచారం చేస్తోంది.

చింతామోహన్... ఆయన పేరు ఎంతో సుపరిచితం..!

తిరుపతి లోక్​సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరు సార్లు ఎంపీగా పనిచేశారు. తెదేపా నుంచి ఓసారి, కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు గెలిచారు. ఇక్కడ పార్టీల పేరుకన్నా... వ్యక్తిగతంగా చింతామోహన్​ సుపరిచితుడనే ప్రచారం ఉంది. వైకాపా, తెదేపా, భాజపా అభ్యర్థులకు దీటుగా చించామోహన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరు సార్లు తనను ఆదరించారని... ఈసారీ తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వ్యక్తిగతంగా తనకున్న పేరుతో... చింతామోహన్ పార్టీ, తన అభిమానులతో కలిసి ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కార్పొరేషన్లు, మున్సిపల్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత: జగన్‌

ABOUT THE AUTHOR

...view details