మునుపెన్నడూ చూడని పరిస్థితులను దాటుకుని కలియుగ వైకుంఠనాథుడి దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. గత కొద్దిరోజులుగా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 30 వేలను దాటింది. కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేస్తోంది. లాక్డౌన్ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం చేసిన సమయంలో దర్శనాల కోసం ఆన్లైన్ లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాల టోకెన్లను బుక్ చేసుకున్న వారికే తితిదే అవకాశం కల్పించింది.
ఆ తర్వాత సామాన్యభక్తుల నుంచి వస్తున్న విన్నపాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్ లైన్ విధానంలో తిరుపతిలో టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను రెండు కేంద్రాల్లో జారీ చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 7వేల సర్వదర్శనం టోకెన్లను ఇస్తున్నా.. భక్తులు అధికంగా వచ్చిన పక్షంలో ఉపయుక్తమయ్యేలా మరో 3వేల టోకెన్లను అదనంగా అధికారులు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో.. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శనాల గైర్హాజరు శాతం పెరుగుతోంది. గతంవారం రోజుల నుంచి నమోదైన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టం అవుతున్నాయి. ప్రత్యేకించి ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లను ముందుగానే బుక్ చేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో దర్శననాలకు రావటంలేదు. టైంస్లాట్ సర్వదర్శనాల కోసం క్యూలైన్ల వద్ద హోరాహోరీగా తలపడి టోకెన్లు పొందిన భక్తుల్లోనూ గైర్హాజరీ అధిక సంఖ్యలో కనిపిస్తోంది.