తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలు... ఆసక్తిని రేపుతున్నాయి. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా మంది భావించారు. గెలుపు అవకాశాలు ఉంటాయన్న అంచనాతో తమకు పట్టున్న ప్రాంతాల్లో కార్పొరేటర్ పదవి కోసం.. నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలోని 11 డివిజన్లలో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండగా మిగిలిన 39 స్థానాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
బరిలో నిలవడమే కష్టంగా మారిందంటున్న అభ్యర్థులు - Tirupati city governing body elections
అష్టకష్టాలు ఓర్చి.. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉప సంహరణ గడువు సమీపించే కొద్ది తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. పోటీ నుంచి తప్పించేందుకు.. ప్రత్యర్థులు సామ దాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. గెలుపు, ఓటముల సంగతి ఎలా ఉన్నా.. బరిలో నిలవడమే కష్టంగా మారిందంటున్నారు.
బరిలో నిలవడమే కష్టంగా మారిందంటున్న అభ్యర్థులు
ఎక్కువ డివిజన్లు ఏకగ్రీవం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు ఎత్తులు వేస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు హడలెత్తిపోతున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. నామినేషన్ల సమయంలో అన్ని సమస్యలు అధిగమించి అభ్యర్థులను బరిలో దించిన పార్టీలు వారు ఉపసంహరించుకోకుండా ఉండటానికి నానా తంటాలు పడుతున్నాయి.