తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రాణవాయువు అందుబాటులో లేక చనిపోయింది 11 మంది అని చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్.. అధికారికంగా ప్రకటించారు. కానీ కళ్లెదుటే విలవిల్లాడుతూ ఊపిరి ఆగిన మృతుల బంధువులు.. ఈ సంఖ్యను ఏమాత్రం అంగీకరించడం లేదు. జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది వారి అనుమానం. రేపో మాపో డిశ్చార్జై.. ఇంటికి వస్తారనుకున్నవాళ్లను ఇలా రుయా సిబ్బంది నిర్లక్ష్యంతో మార్చురీలో చూస్తామనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వ లెక్కలు, రుయా సిబ్బంది నిర్లక్ష్యంపై మానవ హక్కుల సంఘంతోపాటు న్యాయస్థానంలో పిల్ వేస్తామని తెలిపారు.
మరణాలే కాదు.. ఆక్సిజన్ ఎంతసేపు ఆగిపోయిందనేదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఐదు నిమిషాలే ఆక్సిజన్ సరఫరా ఆగిందని అధికారులు అంటుంటే.. అరగంటకుపైనే ఐసీయూలో ఆర్తనాదాలు చూశామని.. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రాణవాయువు కోసం తమ వాళ్లు మంచం మీదే విలవిల్లాడుతూ చనిపోయారని చెప్పారు. ఈ కడుపుకోతను తీర్చేదెవరని నిలదీస్తున్నారు. చనిపోయిన 11 మంది తప్ప మిగతావారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికారులు చెప్తున్నా ఐసీయూలో ఆర్తనాదాలు ప్రత్యక్షంగా చూసినవారు.... భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం.. అసలు రుయాలో ఏం జరిగిందనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
సంబంధిత కథనాలు: