తితిదే శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి) ట్రస్టును 2019 సంవత్సరం అక్టోబర్ 21న ఏర్పాటు చేశారు. ప్రారంభంలో భక్తుల నుంచి స్పందన కరవైంది. అదనపు ఈవో ధర్మారెడ్డి ట్రస్టును బలోపేతం చేసే దిశగా పలు మార్పులను తీసుకువచ్చారు. తక్కువ మొత్తంలో విరాళం ఇచ్చే భక్తులకు సైతం సౌకర్యాలు కల్పించేలా ట్రస్ట్ విధివిధానాలలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ట్రస్టులో లక్ష రూపాయలకు పైగా విరాళం అందించే దాతలకే సౌకర్యాలు కల్పిస్తున్న తితిదే... శ్రీవాణి ట్రస్టు ద్వారా 10 వేల రూపాయలను ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు పొందే అవకాశం కల్పించారు.
పది వేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంతో పాటు 500 రూపాయలు చెల్లించి టిక్కెట్ పొందిన వారికి వీఐపీ దర్శన సమయంలో ప్రోటోకాల్ పరిధిలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ కారణంగా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2019 అక్టోబర్‌లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించినా కరోనా ప్రభావంతో 2020 మార్చి నుంచి దాదాపు మూడు నెలల పాటు ఎలాంటి దర్శనాలు కల్పించలేదు. ట్రస్ట్‌కు విరాళాలు ఆగిపోయాయి. 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు పూర్తి స్థాయిలో శ్రీవాణి దాతలకు దర్శనాలకు అవకాశం కల్పించారు.