MP Pilli Subhash Chandra Bose: ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురౌతున్నారని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 17వేల మంది రైతుల ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ కోరతానని వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లను సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే క్షేత్రస్థాయిలో కొందరు రైతులకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సన్న, చిన్నకారు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే ప్రజాప్రతినిధులు చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. ఈ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.