గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 15 లాంచీలు, 339 మర పడవలు సిద్ధం చేసినట్టు పాలనాధికారి మురళీధర్‌రెడ్డి చెప్పారు. వరదల్లో చిక్కుకుని ఇద్దరు మృతిచెందారని, మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. జిల్లాలో 129 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్... 1,902 హెక్టార్ల వరి, 8,922 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. వరద ప్రవాహం తగ్గే క్రమంలో కాలువల గట్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కోతకు గురయ్యే అవకాశంతో జలవనరుల శాఖను అప్రమత్తం చేశామని చెప్పారు.
ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువల్లోకి 8,800 కూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎటపాక డివిజన్‌లో 57, రంపచోడవరం డివిజన్ లో 31, అమలాపురం డివిజన్ లో 73 వరద ప్రభావిత గ్రామాలున్నాయి. రాజమహేంద్రవరం డివిజన్‌లో 10, రామచంద్రపురం డివిజన్‌లో 5, కాకినాడ డివిజన్‌లో ఒకటి చొప్పున వరద ప్రభావిత గ్రామాలున్నాయి. రంపచోడవరం, అమలాపురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఏటపాకలో ఎన్డీఆర్ఎఫ్ బృందం సేవలు అందిస్తున్నాయి. అందుబాటులో 195 లైఫ్ జాకెట్లు, మూడు జనరేటర్లు, శాటిలైట్ ఫోన్ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలకు 42 క్లస్టర్ బృందాలు, 14 మొబైల్ బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు.