Undavalli Arun Kumar: కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఆయన్ను కలిశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. అదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేసీఆర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అయితే పార్టీ ఏర్పాటు గురించి వారి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. భేటీలో భాజపా గురించి పలు అంశాలపై చర్చించామని.. ఆ పార్టీపై ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియా సమావేశం నిర్వహించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌లో భాజపా బలంగా ఉంది. ఏపీలో ఏ పార్టీ ఎంపీ సీట్లు గెలిచినా.. అవి భాజపావే. భాజపాకు ఏపీలో ఉన్న బలం మరో రాష్ట్రంలో లేదు. ఏపీలో వైకాపా, తెదేపా, జనసేన.. అన్ని పార్టీలు భాజపాకే మద్దతు ఇస్తాయి. ఏపీలో భాజపాను వ్యతిరేకించే పరిస్థితి లేదు’’ అని ఉండవల్లి తెలిపారు.
‘భాజపా పట్ల నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. మోదీ మరోసారి ప్రధాని అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకమనే ముద్ర భారత్‌కు మంచిది కాదు. భాజపా నేతల వ్యాఖ్యల వల్ల ముస్లిం దేశాల్లో వ్యతిరేకత వస్తోంది. నాలుగైదు దేశాలు క్షమాపణ చెప్పాలని భారత్‌ను కోరాయి. ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఉండొద్దనే కోణంలోనే భాజపా ముందుకు వెళ్తోంది. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ మాత్రం ధైర్యంగా భాజపాకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. జాతీయ అంశాలపై కేసీఆర్ కసరత్తు చేశారు. చాలా విషయాల్లో కేసీఆర్ స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆయన స్పష్టంగా వివరించారు. భాజపా వల్ల దేశానికి ప్రమాదం ఉందని చెప్పారు. భాజపాను అడ్డుకోకపోతే మరింత నష్టమన్నారు. నేను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పాను. మా భేటీలో ప్రశాంత్ కిశోర్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ లాగే కేసీఆర్ కూడా మంచి వక్త, కమ్యూనికేటర్. కేసీఆర్ హిందీ, ఇంగ్లీష్‌లోనూ బాగా మాట్లాడగలరు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేరు’ అని ఉండవల్లి పేర్కొన్నారు.