తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముగ్గురు కరోనా బాధితులకు వారి నివాసాల్లోనే (హోం ఐసోలేషన్) ఉంటూ చికిత్స పొందే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ఇతర దేశాల తరహాలో స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి అందరూ సుముఖంగా లేరని, అందుకే వైరస్ లక్షణాలున్నా గోప్యంగా ఉంచుతున్నారని ఆయన తెలిపారు. చెన్నై నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన భార్యాభర్తలతో పాటు.. వారి బంధువు ఒకరు రాజమహేంద్రవరానికి వచ్చారు. ఈ ముగ్గురితో పాటు కుటుంబంలో వేరెవ్వరికీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. కానీ పక్క రాష్ట్రం నుంచి రావడంతో తొలుత ట్రూనాట్, తర్వాత ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా, ఈ ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని శుక్రవారం వెల్లడైంది. కానీ ఆసుపత్రిలో కాకుండా ఇంటివద్దే చికిత్స తీసుకోడానికి వారు మొగ్గు చూపారు. దీంతో వారికి పల్స్ ఆక్సీమీటర్, అవసరమైన మందులు, హ్యాండ్‌వాష్, ఇతర సరంజామాతో కూడిన కిట్‌ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందించారు.