Padayatra: మొక్కవోని సంకల్పంతో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు 33వ రోజు ప్రకృతి సైతం సహకరించింది. నిడదవోలు గణేష్ సెంటర్‌లో గోబ్యాక్ అంటూ నినాదాలు చేసిన వైకాపా శ్రేణులు..వరుణుడి దెబ్బకు వెనకడుగేశాయి. మునిపల్లి నుంచి రాజధాని రైతుల పాదయాత్ర నిడదవోలుకు సమీపిస్తుండగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక వైకాపా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నల్లబెలూన్లు, 3 రాజధానుల ప్లకార్డులతో గో బ్యాక్ అంటూ రాజధాని రైతులకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు పెద్దఎత్తున గుమికూడాయి. పోలీసులు అక్కడికి వచ్చిన వారిని నిలువరించలేదు. రైతుల యాత్ర సమీపించగానే వైకాపా శ్రేణులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు సంఘీభావంగా యాత్రలో తెదేపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. పోటాపోటీ నినాదాలతో గణేశ్ సెంటర్ దద్దరిల్లింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది. వైకాపా శ్రేణులు ఆ వర్షానికి చెల్లాచెదురయ్యాయి. ఆశ్రయం కోసం గుమిగూడిన శ్రేణులంతా తలోదిక్కుకు పరుగులు తీయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వైకాపా శిబిరం ఖాళీ అయ్యింది. రైతులు జోరు వర్షంలోనే జై అమరావతి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మహాపాదయాత్ర గణేష్ సెంటర్ దాటగానే ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది.
రాజధాని రైతుల మహాపాదయాత్రకు కొందరు వైకాపా కార్యకర్తలు సైతం మద్దతు తెలిపారు. పురుషోత్తపల్లి గ్రామం నుంచి డి.ముప్పవరం వరకు వచ్చి రైతులకు సంఘీభావంగా నడిచారు. రాజధాని అమరావతికే తమ మద్దతని ప్రకటించారు.
మునిపల్లి వాసులు తమ మద్దతు అమరావతికేనని ముక్తకంఠంతో నినదించారు. 3 రాజధానులు వద్దే వద్దంటూ రైతులతో కలిసి నినాదాలు చేశారు. వైకాపా నేతలకు తప్ప 3 రాజధానులతో ప్రజలకు ఉపయోగం లేదన్నారు. వివిధ అసోసియేషన్ల పేరుతో మూడురాజధానుల మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే బ్యానర్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వాటితో తమకు సంబంధం లేదని.. ఆయా సంఘాలు వివరణ ఇస్తూ అక్కడే తమ పోటీ బ్యానర్లు నెలకొల్పాయి.