ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ హయాంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యలు, అత్యాచారాలు' - ధర్మవరంలో స్నేహలత హత్య కేసు న్యూస్

అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత యువతి హత్యకు నిరసనగా తెదేపా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. యువతి హత్య నుంచి దృష్టి మరల్చేందుకే.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే దాడి చేశారని పలువురు నేతలు విమర్శించారు.

'జగన్ హయాంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యలు, అత్యాచారాలు'
'జగన్ హయాంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యలు, అత్యాచారాలు'

By

Published : Dec 24, 2020, 11:28 PM IST

ధర్మవరంలో యువతి హత్యకు నిరసనగా తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. స్నేహలతను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూపురం పట్టణంలో తేదేపా శ్రేణులు కొవ్వొత్తులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తేదేపా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల కిష్టప్ప, పరిటాల శ్రీరాములు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు.

వెంటనే న్యాయం చేయాలి

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో కాగడాలతో నిరసన, మానవ హారం నిర్వహించారు. స్నేహలత హత్యకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే, కనిగిరి తెదేపా ఇన్​ఛార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, స్నేహాలత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అందుకే జేసీ ఇంటిపై దాడి

యువతి హత్య ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే దాడికి తెగబడ్డారు అని నాయకులు కేశినేని శ్వేత, నెట్టెం రఘురాం ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెనకబడిన వర్గాలు మహిళలపై దాడులు పెరిగిపోయాయని శ్వేత ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు

ఎస్సీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎంపీ కొణకళ్ల నారాయణ మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు.

యువతి హత్యను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. కోటగుమ్మం వద్ద తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం భారీ కాగడాల ప్రదర్శన చేపట్టారు. పుష్కర్ ఘాట్ వరకు ప్రదర్శన కొనసాగింది.

మహిళలకు భద్రత లేదు

మహిళ హత్యకు నిరసనగా తిరుపతి తెదేపా నాయకులు, కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం భద్రత కల్పించలేకపోతుందని మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ మండిపడ్డారు.

ప్రభుత్వం విఫలమైంది

నరసరావుపేటలో తెదేపా శ్రేణులు నరసరావుపేట పార్లమెంటరీ తెదేపా మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందంటూ నేతలు ఆరోపించారు. కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం స్థానిక తెదేపా కార్యాలయం నుంచి కోటసెంటర్ వరకూ సాగింది.

ఇదీ చదవండి:గండికోట నిర్వాసితులను క్షమాపణలు కోరిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details