భారీ వర్షాలు రైతన్నను నిండా ముంచేశాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 2.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వ్యవసాయ పంటలు 1.79 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు 23 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కడప జిల్లాలో 1,190 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల మెట్ట పైర్లలో నీరు నిలిచే ఉంది. నీరు బయటకు పోయే కొద్దీ నష్టతీవ్రత మరింత పెరగనుంది. కృష్ణా నదికి వరద పెరుగుతుండటంతో కొన్నిచోట్ల ఇంకా ముంపు భయం పొంచి ఉంది. వరితోపాటు పత్తి, మిరప, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిచింది. మొక్కజొన్న, మొలకలు వచ్చింది. మిరప నీటిలో నానుతోంది. మినుము చేతికొచ్చే పరిస్థితి లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. పత్తి కాపు నేల రాలిపోవడంతోపాటు కాయలు కుళ్లిపోతున్నాయి.
లంక గ్రామాల్లో కలవరం
ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీరు పెద్ద ఎత్తున విడుదల చేస్తుండటంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాల పరిధిలోని రైతులు కలవరపడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటికే 8సార్లు నీటిని విడుదల చేశారు. ప్రతిసారీ పంటలు నీట మునుగుతూనే ఉన్నాయి. కాస్త ఆరగానే.. మొక్కల్ని కాపాడుకునేందుకు పెట్టుబడులు పెడుతున్నారు. ఇంతలోనే మళ్లీ వరద ముంచెత్తుతోంది. ఇలా వరుసగా నష్టపోతున్నామని కొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు ముసీ నుంచి, ఇటు వాగుల నుంచి పెద్ద ఎత్తున ప్రవాహాలు కృష్ణానదికి చేరుతున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోనూ భూములు మునకేస్తున్నాయి.
11 మంది మృత్యువాత
ఆరు జిల్లాల్లోని 91 మండలాల్లో వరద ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. 371 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. విశాఖపట్నంలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది మృత్యువాతపడ్డారు. 7,469 మందిని సహాయశిబిరాలకు తరలించి ఆహారం, మంచినీరు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో 9 విపత్తు నివారణ దళాలను మొహరించినట్లు విపత్తు నివారణశాఖ తెలిపింది.
దారులన్నీ ధ్వంసం
భారీ వర్షాలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులు కలిపి మొత్తం 1,470 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరద ప్రభావం తగ్గిన తర్వాత మరికొన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు తేలే అవకాశముంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు అన్ని జిల్లాల్లో కలిపి 3 వేల కి.మీ.మేర రాష్ట్ర, జిల్లా రహదారులు దెబ్బతిన్నట్లు తేల్చారు. వీటి మరమ్మతులకు ఇటీవలే సీఎం ఆదేశించడంతో ఆ వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఇంతలోనే భారీ వర్షాలు ముంచెత్తి మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్లను ధ్వంసం చేశాయి.
- పశ్చిమగోదావరి జిల్లాలో 894, కృష్ణా జిల్లాలో 419, విశాఖపట్నం జిల్లాలో 158 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.845 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేశారు.
- 61 చోట్ల రహదారులకు గండ్లుపడి, కొంత భాగం కొట్టుకుపోయాయి.
- 277 కల్వర్టులు దెబ్బతిన్నాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి.
- విశాఖపట్నం జిల్లాలో 372 విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పశ్చిమ గోదావరిలో నాలుగు చోట్ల 33కేవీ ఫీడర్లు, 15 చోట్ల 11 కేవీ ఫీడర్లకు నష్టం వాటిల్లింది.
- పశ్చిమగోదావరి జిల్లాలో 10 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు కాల్వకు మూడు చోట్ల గండి పడింది. విశాఖపట్నం జిల్లాలో సోమిందేవిపల్లిలో వరాహ నది కుడికాల్వ గట్టు దెబ్బతింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ