గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. రెండేళ్ల కిందట కచ్చులూరు ఘటన తర్వాత నిలిచిన యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభించారు(Papikondalu boating start). వరదల కారణంగా కొంతకాలం ఆగిన పాపికొండలు విహారయాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. దేవీపట్నంలోని పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు విహారం సాగనుంది. ఈ యాత్రను రాజమహేంద్రవరంలో మంత్రి అవంతి ప్రారంభించనున్నారు. గోదావరిలో 26 మీటర్ల స్థాయిలో బోట్ల రాకపోకలకు అనుమతిచ్చారు.
ఎక్కడినుంచి..: ఏపీ టూరిజం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా టికెట్లు తీసుకోవాలి. సొంత వాహనాలు లేని సందర్శకులు రాజమహేంద్రవరం సరస్వతీఘాట్‌లో ఉన్న పర్యాటక శాఖ కార్యాలయానికి ఉదయం 6.30కు చేరుకోవాలి. పర్యాటకులను అక్కడినుంచి గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వరకు వాహనంలో తీసుకెళ్తారు. యాత్ర అక్కడినుంచి మొదలవుతుంది.
యాత్ర సాగేదిలా..: ఉదయం అల్పాహారం, బోటులోనే మధ్యాహ్న భోజనం అందిస్తారు. బోటింగ్ చివరి పాయింట్ పేరంటాలపల్లి. అక్కడ అరగంట విరామం ఇస్తారు. తిరిగి అదే మార్గంలో గండిపోచమ్మ కంట్రోల్‌రూమ్‌కు బోటు చేరుకుంటుంది. అక్కడినుంచి పర్యాటకులను తిరిగి ఉదయం ప్రారంభమైన ఏపీ టూరిజం కార్యాలయానికి సాయంత్రం ఏడింటికి చేర్చుతారు.