ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపన్న హస్తం... అందించు నేస్తం! - companies helping to hospitals to cure corona

తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం కరోనా రెండో వేవ్​ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్న వేళ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించవలసిన సమయం వచ్చింది. నిధులు సమకూర్చడం, ఆసుపత్రులకు అవసరమైన పరికాలు అందించడం, రోగులకు ఉపయోగకరంగా ఇతర రూపాల్లో సహాయం అందించడం ఎంతో అవసరం.

ngo services at east godavari district
సామాజిక స్ఫుహతో ఆపన్న హస్తం అందిస్తున్న సంస్థలు

By

Published : May 11, 2021, 4:42 PM IST

మోరిపూడిలో కొవిడ్‌ సేవల కోసం యాజమాన్యం కేటాయించిన సుబ్బమ్మ క్రిస్టియన్‌ ఆసుపత్రి లోపలి ఉపకరణాలు

కొవిడ్‌ ఆరోగ్య అత్యయిక పరిస్థితి తెరమీదకు వచ్చింది. సరైన సమయంలో వైద్యం అందక కొందరు తల్లడిల్లుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో.. బాధితులకు కాస్తయినా సాంత్వన చేకూరాలంటే సహృదయుల ఊతం అందాలి. ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులు నిండుకున్నాయి. ఇదే సమయంలో అదనపు ఆక్సిజన్‌ నిల్వలు, ఇతర వనరుల కోసం అవసరమైన నిధులు సమకూర్చాల్సిన తరుణమిది. ప్రభుత్వం సేవలకు ఊతమిస్తున్నా.. పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం రూపంలో లేదా పరికరాల రూపంలో సమకూరిస్తే కష్టకాలంలో మరింత ఊపిరులూదినట్లే.

తొలి స్ఫూర్తితో...

నిరుడు మార్చి నుంచి విరామం లేకుండా తూర్పుగోదావరి జిల్లాను కరోనా వెంటాడుతోంది. తొలి దశలో పలు సంస్థలు ముందుకొచ్చి ఊతమిచ్చాయి. కొందరు కొవిడ్‌ సహాయ నిధి కోసం జిల్లా యంత్రాంగానికి విరాళాలిస్తే.. మరికొందరు పరికరాలు.. ఇంకొందరు బాధితులకు ఉచిత సేవలు, ఆహారం, మాస్కులు, శానిటైజర్ల అందజేత తదితర కార్యక్రమాలు చేపట్టి స్ఫూర్తిగా నిలిచారు. ప్రస్తుతం రెండోదశ కొవిడ్‌ తారస్థాయికి చేరిన తరుణంలో సహృదయులు ఔదార్యం చాటుతున్నారు.

కొవిడ్‌ సంక్షేమ నిధికి రూ.50 లక్షల విరాళాన్ని కలెక్టర్‌కు అందిస్తున్న జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు

కష్టకాలంలో కొంత సాయం..

  • కొవిడ్‌ సేవలకు ‘కాకినాడ సీ పోర్టు’ యాజమాన్యం జిల్లా యంత్రాంగానికి రూ. కోటి విరాళంగా అందించింది.
  • కాకినాడ జీజీహెచ్‌కు ఇటీవల సేఫ్‌ వే కన్‌సెషన్స్‌ సంస్థ ప్రతినిధులు తొమ్మిది ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కలెక్టర్‌కు అందించారు.
  • ఎస్‌ఆర్‌ఎంటీ యాజమాన్యం తొలిదశ కొవిడ్‌ సమయంలో రూ.25 లక్షలు అందిస్తే.. రెండో దశలో రూ.20 లక్షలు కొవిడ్‌ సహాయ నిధి కింద జిల్లా యంత్రాంగానికి అందించింది.

సమకూరిన కాన్సన్‌ట్రేటర్‌

మేము సైతం..

కొవిడ్‌ బాధిత ఉపాధ్యాయులకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో 10 పడకలతో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరావు, సాబ్జీ కోరారు. రాజమహేంద్రవరం, ముమ్మిడివరం, కూనవరంలో సీపీఐ కార్యాలయాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగించుకోమని జిల్లా కార్యదర్శి మధు కలెక్టర్‌ను కోరారు. కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో సీపీఎం కార్యాలయాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగించుకోమని జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ కలెక్టర్‌ను కోరారు. నిరుడు వీరి విజ్ఞప్తి మేరకు పెద్దాపురం కార్యాలయాన్ని కొవిడ్‌ కేర్‌ సెంటరుగా వినియోగించారు.

సొంత నిధులతో...

50 పడకల తుని ప్రాంతీయ వైద్యశాలలో 20 పడకలకే ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. కొవిడ్‌ తీవ్రత వేళ మిగిలిన పడకలకూ ఈ వసతి కల్పించేలా విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

కరోనా మృతుల అంతిమ యాత్రకు రాజమహేంద్రవరం అర్బన్‌ వైకాపా సమన్వయకర్త ఆకుల సత్యనారాయణ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటుచేశారు. ‘ప్రశాంతంగా చివరి ప్రయాణం’ పేరుతో మృతదేహాలను ఉచితంగా శ్మశాన వాటికలకు తరలించడానికి తన సొంత నిధులతో వాహనాన్ని సమకూర్చారు.

తరుణమిదే..

జిల్లాలో అతి భారీ 57, భారీ 179, సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమలు 8,167 ఉన్నాయి. పెద్ద పరిశ్రమల్లో రూ.వెయ్యి కోట్లు వార్షిక ఆదాయంగానీ, రూ.5 కోట్ల వార్షిక లాభం ఉన్న సంస్థలు విధిగా లాభాల్లో రెండు శాతం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కేటాయించాలన్న నిబంధన ఉంది. జిల్లాలో కొన్ని సంస్థలు మాత్రమే ఈ చొరవ చూపుతున్నాయి. అందరూ స్వచ్ఛందంగా కదిలితే వసతులు, వనరులు సమకూరే వీలుంది.

బాధ్యతగా స్పందించండి..

రెండోదశలో ఇప్పటికే కొన్ని సంస్థలు స్పందించి సహాయం అందించాయి. మరికొందరు ముందుకు వస్తున్నారు. అవకాశం ఉన్న వ్యక్తులు, సంస్థలు.. సీఎం సహాయ నిధికి, కొవిడ్‌ సహాయ నిధికి నగదు అందించవచ్చు. ఆసుపత్రులకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాలు ఇవ్వవచ్చు. దాతలు కలెక్టరేట్‌లోనూ సంప్రదించవచ్చు.- డి.మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌

ఆసుపత్రులకు ఏమేం కావాలంటే..?

  • ఆక్సిజన్‌ ప్లాంట్లు
  • సిలిండర్లు
  • కాన్సన్‌ట్రేటర్లు
  • పడకలు
  • స్ట్రెచర్లు
  • వీల్‌ఛైర్లు
  • పౌష్టికాహారం, శుద్ధ జలాలు

ఇవీ చదవండి:

'మోదీ జీ... ఆ అద్దాలు తీసి చూడండి'

600 కిలోల గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details