తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కరోనా సోకటంపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గనతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ సహా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజమహేంద్రవరం ఘటనలో 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావటంపై అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉందని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రైవేటు జూనియర్ కళాశాలలో కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. సదరు జూనియర్ కళాశాలలో చదువుతున్న 400 మంది విద్యార్ధులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 35 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.