Meeting on Polavaram: రానున్న పది రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక భేటీ జరగనుంది. ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేంద్ర జలశక్తి, జలసంఘం ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో, సభ్య కార్యదర్శి, రాష్ట్ర జలవనరుల శాఖ, పోలవరం అధికారులు చర్చిస్తారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ శుక్రవారం పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు ఈ కసరత్తు సాగుతోంది. ఈ నెల 14 లేదా 15న జరిగే ఈ సమావేశం వేదిక ఇంకా ఖరారు కాలేదు. ప్రాజెక్టు ముందడుగు వేయాలంటే సకాలంలో నిధులు అందడం, డిజైన్లను ఖరారు చేయడమే అత్యంత కీలకం. పోలవరం ప్రాజెక్టు డిజైన్లను ఖరారు చేసి అప్పజెబితే 12 నుంచి 14 నెలల కాలంలో నిర్మాణం పూర్తి చేసి, అప్పగించేస్తామని శుక్రవారం నాటి సమావేశంలో మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు సమాచారం. సమీక్ష సమావేశం పూర్తయి ముఖ్యమంత్రి జగన్ వెళ్లిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు కేంద్ర మంత్రి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. భాజపా నాయకులు సోము వీర్రాజుతోపాటు ఒకరిద్దరు నాయకులు, మేఘా ఎండీ కృష్ణారెడ్డి కంపెనీ ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
నిధులు...
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,548.87 కోట్ల సవరించిన అంచనాలకు కేంద్రం పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ‘ఏడాదికి సగటున రూ.1,500 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుంటే ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది’’ అని కేంద్ర మంత్రి షెఖావత్‌ను ప్రశ్నిస్తే.. ‘రాష్ట్రం ఇంకా అనేక అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. వారు ఆ పని పూర్తి చేస్తే కేంద్రం తన పని తాను చేస్తుంది’ అని షెఖావత్ సమాధానం ఇచ్చారు. శుక్రవారం నాటి సమావేశంలో నిధుల సవాల్‌పైనా చర్చ జరిగింది. పోలవరం అథారిటీ అధికారులు, కేంద్ర జలశక్తి అధికారులు, ఏపీ అధికారులు కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఆదేశించారు. ఆ క్రమంలోనే పది రోజుల్లో భేటీకి రంగం సిద్ధం చేస్తున్నారు.
డిజైన్లు...
పోలవరంలో ప్రస్తుతం చేపట్టాల్సిన కీలక నిర్మాణం ప్రధాన రాతి, మట్టి కట్టతో కూడిన డ్యాం. దీనికి దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుంది. గోదావరి వరదలతో ఈ డ్యాం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోత పడింది. లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కోసుకుపోయింది. దీంతో డ్యాం డిజైన్ల ఖరారు సవాల్‌గా మారింది. అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని కేంద్ర మంత్రి సూచించారు.
రీయింబర్సుమెంటు...
ప్రాజెక్టుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వమే నిధులను ఖర్చు చేస్తోంది. కేంద్రం రీయింబర్సు చేస్తోంది. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇంతవరకు రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.2,200 కోట్లు రావాల్సి ఉంది. వాటిపై పోలవరం అథారిటీ, కేంద్ర జలశక్తి అధికారులు పలు కొర్రీలు పెడుతున్నారు. ఫలితంగా గుత్తేదారుల బిల్లులు పెండింగులో ఉంటున్నాయి. ఈ ప్రభావంతో కొద్ది నెలలుగా పోలవరం పనులు మందగించాయి.