ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆందోళనలో వృత్తి కళాకారుల జీవనం - ap lockdown effect on folk artists

నిద్రలో వచ్చేది కల.. నిద్ర మత్తును వదిలించి ఆలోచింపజేసేది కళ.. కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం.. దీన్ని అక్షరాలా నమ్మిన వందల మంది కళాకారులు కళకే అంకితమయ్యారు. డప్పు, సితార, హార్మోనియం.. వాద్యమేదైనా.. బుర్రకథ, హరికథ, యక్షగానం కళారూపం ఏదైనా.. కళే జీవనోపాధిగా ప్రజలకూ ప్రభుత్వాలకూ వారధిగా నిలుస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ వేళలో కాలు బయటపెట్టలేక.. ప్రదర్శనలు ఇవ్వలేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి కరవై పస్తులుంటున్న కళాకారులు పాత బకాయిలైనా ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆందోళనలో వృత్తి కళాకారుల జీవనం
లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆందోళనలో వృత్తి కళాకారుల జీవనం

By

Published : May 28, 2020, 2:35 PM IST

లాక్​డౌన్ ఎఫెక్ట్: ఆందోళనలో వృత్తి కళాకారుల జీవనం

జానపద వృత్తి కళాకారులు. కళే వీరి జీవితం కళే వీరి వ్యాపకం. కళే వీరి సర్వస్వం.. ఎంతటి సంక్లిష్ట విషయాన్నైనా... తమ నైపుణ్యంతో సులభంగా ప్రజలకు చెప్పగల నేర్పరులు.. అందుకే వీరి సేవలను ప్రభుత్వాలు కూడా ఉపయోగించుకుంటాయి. కళే జీవితంగా బతికే వీరి ద్వారా ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పిస్తున్నాయి. ఒకవిధంగా ప్రజలకూ ప్రభుత్వాలకూ మధ్య వారధులు.. కళాసారథులు

ఇలా కళనే నమ్ముకున్న కళాకారులు రాష్ట్రమంతటా వేల సంఖ్యలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రావులపాలెం, అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, అనపర్తి తదితర ప్రాంతాల్లో జానపద వృత్తి కళాకారులు ఉన్నారు. బుర్రకథ, హరికథ, వీధి నాటకాలు, జానపద గేయాలు ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబాల్లో కళ వారసత్వంగా వస్తుంది. తరతరాలుగా కళనే నమ్ముకున్న కుటుంబాలివి. అందుకే ఈ కుటుంబాల్లో పెద్దలే కాదు..పిల్లలూ తమ కళతో ఔరా అనిపిస్తారు.

ముఖానికి రంగేసుకుని.. తళుకుబెళుకు దుస్తులతో ప్రదర్శనల్లో మెరుపులు మెరిపించే వీరి జీవితాలు మాత్రం కళావిహీనమవుతున్నాయి. వీరికి ఈ కళ తప్ప వేరే పని రాదు. ప్రదర్శనల ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయమే వీరికి బతుకు తెరువు. ప్రభుత్వ భాషా,సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలోనూ ఈ కళాకారులు ప్రదర్శనలు ఇస్తుంటారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభల్లోనూ వీరికి అవకాశం దక్కుతుంది. లాక్ డౌన్‌ కారణంగా ప్రదర్శనలు లేక దాతలు ఇచ్చే సరుకులతోనే కడుపునింపుకుంటున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. వీరి పారితోషికాల చెల్లింపు విషయంలో మాత్రం అలవిమాలిన జాప్యం జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018 ఆగస్టు నుంచి 2019 జనవరి వరకు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి వీరికి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలోనూ సీఎం జగన్ పాల్గొన్న సభల్లోనూ వీరు ప్రదర్శనలిచ్చారు. కానీ ఇప్పటి వరకూ ఆ సొమ్ము వీరికి అందలేదు.. కరోనాతో కాలు బయటపెట్టలేని పరిస్థితుల్లో పాత బకాయిలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.ఇది ఒక్క తూర్పుగోదావరి జిల్లా కళాకారులదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులదీ ఇదే ఆవేదన. బతుకుదెరువు కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు.

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్​.. కళాకారుల స్వయం ఉపాధికి గండి

ABOUT THE AUTHOR

...view details