జనసేనాని రహదారుల శ్రమదానంపై సందిగ్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదాల పరిస్థితిపై గాంధీజయంతి రోజైన ఇవాళ శ్రమదానం చేస్తామని....పవన్ ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ధవళేశ్వరంలోని కాటన్ ఆనకట్ట రహదారికి పవన్ శ్రమదానం చేయాల్సి ఉంది. వరద, భద్రతా కారణాల దృష్ట్యా జలవనరుల శాఖ అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో రాజమహేంద్రవరంలోని హుకుంపేట – బాలాజీపేట రోడ్డుకు కార్యక్రమాన్నిమార్చుకున్నారు . పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం సాయంత్రం రోడ్డుపై గుంతల్ని పూడ్చే ప్రయత్నం చేశారు.కంకర, ఫ్లైయూష్ మిశ్రమాన్ని దెబ్బతిన్న చోట్ల పోశారు.
తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నాయకులు....ప్రభుత్వం నాసిరకంగా మరమమ్మతులు చేస్తోందని విమర్శించారు.పవన్ రాకకు భయపడి...అరకొరగా దెబ్బతిన్న చోట్ల కాంక్రీటు మిశ్రమాన్ని నింపారని చిన్న లారీ దానిమీద నుంచి వెళ్లినా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందన్నారు.పోలీసుల సూచన మేరకే శ్రమదానం ప్రదేశాన్ని మార్చుకున్నామని....అయినా ఆంక్షల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.