రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో 'జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు' పేరుతో ఏర్పాటు చేసిన బస్సులను ఎంపీ భరత్ రామ్ ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి సారిగా కొవిడ్ రోగుల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చారు. కరోనాతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరికే వరకు ఈ బస్సుల్లోనే ఆక్సిజన్ అందిస్తారు. రెండు వెన్నెల బస్సుల్ని దీని కోసం సిద్ధం చేశారు. ఆరు బెర్త్‌లకు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి కొవిడ్రోగులతో రద్దీగా మారింది. పాజిటివ్ వచ్చినవారు నిత్యం భారీగా తరలి వస్తున్నారు. బెడ్లు ఖాళీ లేక ఎటు వెళ్లాలో పాలుపోక ప్రభుత్వాసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఈ బస్సుల్లో రెండు మూడు గంటలు ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తారు. ఆక్సిజన్ బస్సులు అందుబాటులోకి తెచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ భరత్ తెలిపారు.