నల్లరాతి క్వారీలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అనుమతులు, నిబంధనలతో సంబంధం లేకుండా కొందరు ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, దేవరపల్లి, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల పరిధిలో నల్లరాతి క్వారీలు ఉన్నాయి. వీటిలో పర్యావరణ అనుమతులు లేని వాటిలో తవ్వకాలను నిలిపివేయాలని ఏప్రిల్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నల్లరాతి క్వారీల తవ్వకాలకు అనుమతులు నిలిపివేశారు. వంద వరకు క్వారీలుండగా 24కు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలినవారు దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా అనుమతులు రానప్పటికీ తవ్వకాలు ఆగడం లేదు.
ప్రభుత్వాదాయానికి గండి: దేవరపల్లి, కొవ్వూరు, ద్వారకాతిరుమల మండలాల్లోని క్వారీల నుంచి అక్రమంగా నల్లరాయిని క్రషర్లకు తరలించి రోజూ సుమారు వెయ్యి లారీల మెటల్(చిప్స్) ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సీనరేజీ ఒక్కో లారీకి రూ.1400 చొప్పున లెక్కిస్తే మూడేళ్లలో రూ.15.12 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సున్నపురాయి, సుద్దరాతి గనుల నుంచి రావాల్సి సీనరేజీని పరిగణనలోకి తీసుకుంటే భారీగానే ఉంటుంది.