Five members died: తూర్పుగోదావరి జిల్లా మన్యంలో విషాదం చోటుచేసుకుంది. జీలుగు కల్లు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డికి చెందిన పి.గంగరాజు (35), సీహెచ్.సుగ్రీవ్ (70), వి.లోవరాజు(28), బి.సన్యాసిరావు(65), కె.ఏసుబాబు(23) తరచూ జీలుగు కల్లు తాగుతారు. బుధవారం కూడా సొంత జీలుగు చెట్టు ఎక్కి కల్లు సేకరించి తాగారు. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో వారిని సర్పంచి లోతా రామారావు, స్థానికులు ద్విచక్ర వాహనాలపై జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఇన్‌ఛార్జి వైద్యాధికారి శ్రీదుర్గ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడకు తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సుగ్రీవ్, లోవరాజు చనిపోయారు. గంగరాజు, సన్యాసిరావును కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఏసుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి కూడా కల్లు నోట్లో వేసుకున్నప్పుడు వాసన రావడంతో ఉమ్మేయడంతో అతను ప్రాణాలతో బతికాడు. గంగరాజు, సన్యాసిరావు పక్క పక్క ఇళ్లవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు, అబ్కారీ, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.
అంబులెన్సు లేదు... మందులూ లేవు...
లోదొడ్డి గ్రామ గిరిజనులు ఐదుగురు కల్లు తాగాక పరిస్థితి విషమించడం గమనించాం. అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్డంగి పీహెచ్‌సీకి ద్విచక్ర వాహనాలపై వారిని తీసుకొచ్చాం. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత వైద్యులు లేరు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉండేవారు. ప్రస్తుతం ఒక్క వైద్యురాలే ఉన్నారు. ఆమె కూడా కాకినాడలో సమీక్ష సమావేశానికి వెళ్లారు. చేసేదేమీ లేక... సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజవొమ్మంగి పీహెచ్‌సీ వైద్యాధికారిణికి సమాచారం ఇవ్వగా... ఆమె జడ్డంగి వచ్చి చికిత్స చేశారు. అప్పటికే 40 నిమిషాలు సమయం పట్టింది. మందులు కూడా లేకపోవడంతో బయట కొన్నాం. ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి. -లోతా రామారావు, లోదొడ్డి సర్పంచి
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్ముతుండడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కల్లు, శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. దీనిపై ఏర్పాటైన తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేడు ఆ ప్రాంతంలో పర్యటించనుందన్నారు.