ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఊళ్లను ముంచేసిన గోదారి - flood

గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, పోలవరం మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

godavari
గోదావరికి వరదలు

By

Published : Jul 24, 2021, 8:56 PM IST

Updated : Jul 25, 2021, 4:34 AM IST

పోలవరం ముంపు గ్రామాలను గోదావరి నీరు ముంచెత్తుతోంది. కొద్దిపాటి వరదకే ప్రాజెక్టు ఎగువన ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతున్నాయి. గోదావరికి అడ్డుగా నిర్మించిన ఎగువ కాఫర్‌డ్యాం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 15 గ్రామాలు, పోలవరం మండలంలో 12 గ్రామాలను నీరు ముంచెత్తింది. అనేక ఊళ్లు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. పోలవరం ఏజెన్సీలో ముంపు బాధిత గ్రామాలవారు ఎత్తయిన ప్రాంతాల్లో కొండలపై సొంతంగా ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరికొందరు డాబాలు ఎక్కారు. కొందరు అసంపూర్తి నిర్వాసిత కాలనీలకు వెళ్లారు. శనివారం రాత్రి 9గంటలకు పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద నీటి మట్టం 33.40 మీటర్లు ఉండగా 6.63 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. ఎగువనుంచి వస్తున్న ప్రవాహాలు 12 లక్షల క్యూసెక్కుల వరకున్నాయని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మరింత ముంపు పెరిగే అవకాశముంది. దేవీపట్నం మండలంలో 8 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 20, కుక్కునూరు మండలంలో 3, వరరామచంద్రపురం మండలంలోని పది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. శనివారం రాత్రికి మరో 20 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయని అంచనా వేస్తున్నారు. కూనవరంలో కోండ్రాజుపేట కాజ్‌వేపై రాకపోకలు నిలిచాయి. చింతూరు వద్ద శబరి నీటిమట్టం 27 అడుగులకు చేరుకుంది. దీంతో చింతూరు-వరరామచంద్రపురం మండలాల మధ్య చప్టా మునిగి రాకపోకలు స్తంభించాయి. చింతూరు మండలంలోని 15 గ్రామాల ప్రజలు మండలకేంద్రానికి వచ్చే పరిస్థితి లేదు. పోలవరం మండలంలో 1200, వేలేరుపాడులో 400, గొమ్ముగూడెంలో 210 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి.

జలదిగ్బంధంలో పోలవరం ముంపు గ్రామాలు

పోలవరం కాఫర్‌డ్యాం వద్ద 32.9 మీటర్లు:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరికి అడ్డుగా 38 మీటర్ల ఎత్తున కాఫర్‌డ్యాం నిర్మించారు. దీన్ని 41.15 మీటర్ల ఎత్తున నిర్మించాల్సి ఉంది. గతేడాది వరదల సమయంలో కాఫర్‌డ్యాం వద్ద ఆగస్టు 24న అత్యంత వరద వచ్చినప్పుడు 28.4 మీటర్ల ఎత్తున నీరు నిలిచింది. గతేడాది గోదావరి గరిష్ఠ వరద సుమారు 23 లక్షల క్యూసెక్కులు. ఆ సమయంలో కాఫర్‌డ్యాంకు అటూఇటూ కూడా నీరు దిగువకు వదిలేందుకు దాదాపు 600 మీటర్లపైన ఖాళీ ఉంచారు. ఈసారి పూర్తి అడ్డుకట్ట ఏర్పడింది. ప్రస్తుతం పోలవరం వద్ద 6.63 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వస్తోంది. స్పిల్‌వే గేట్లన్నింటినీ ఎత్తి వరదను యథాతథంగా దిగువకు వదులుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాఫర్‌డ్యాం వద్ద 32.9 మీటర్ల మేర నీటిమట్టం ఏర్పడింది. గోదావరిలో 6.63 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పెద్ద వరదగా పరిగణించరు.ప్రస్తుత వరదకే ఇలా ఉంటే కొద్ది రోజుల్లో ఆగస్టులో వచ్చే వరద నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెన్నాడుతోంది.

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా వరద తగ్గుముఖం

కృష్ణా నదిలో దిగువన వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి శుక్రవారం అర్ధరాత్రి 1,22,311 క్యూసెక్కుల నీరు వచ్చింది. శనివారం ఉదయం ఆరింటికి 1,25,811 క్యూసెక్కులు రాగా సముద్రంలోకి 1,24,250 క్యూసెక్కులను వదిలారు. మధ్యాహ్నం 3గంటలకు 97,251 క్యూసెక్కులకు వరద తగ్గి 93,150 క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతలలో శనివారం రాత్రి 8 గంటలకు 43.59 టీఎంసీల నిల్వ ఉంది. కర్ణాటకలో తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.

జూరాల నుంచి 3,70,817 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 855.60 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 93.5810 టీఎంసీలుగా నమోదైంది.

ఇదీ చదవండి:నీట మునిగిన సంగమేశ్వర ఆలయం.. ఆలయ పూజారి శిఖర పూజలు

Last Updated : Jul 25, 2021, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details