ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ రహదారిపై ప్రయాణమంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం ఉభయగోదావరి జిల్లాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేల మంది ప్రజలు ఈ బ్యారేజీపై రాకపోకలు సాగిస్తుంటారు. కాటన్ ఆనకట్టపై ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం అనే నాలుగు ఆర్మ్‌లు ఉన్నాయి. వీటి మధ్యలో అనుసంధాన రహదారి ఉంటుంది. వర్షాలకు వంతెనలపై రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. వంతెన ప్రారంభ ప్రాంతం నుంచి ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్‌ల రోడ్లపై తారు పూర్తిగా కోతకు గురైంది. వర్షాలకు గుంతల్లో నీరు చేరి గుంతలు కనపడక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ర్యాలీ ఆర్మ్‌పై తారు కోసుకుపోయి కొన్నిచోట్ల ఇనుప ఊచలు బయటకు వచ్చి వాహనాలు పాడైపోతున్నాయి.
ప్రయాణం చేయాలంటే సాహసమే..
కాటన్ బ్యారేజీ రహదారిపై ప్రస్తుతం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. లారీలు, టిప్పర్లు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణమంటేనే వాహనదారులు సాహసం చేయాల్సి వస్తోంది. మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్‌లపై సిమెంట్ రోడ్డుపై తారు, చిప్స్‌తో తాత్కాలికంగా వేసిన పొర దాదాపుగా కొట్టుకుపోయింది. వర్షాలు రాకముందే రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. గుంతలమయమైన రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.