ఈ ద్రాక్షగుత్తి రూ.8 లక్షలు! - జపాన్లో ద్రాక్షకు అధిక ధర న్యూస్
ద్రాక్షలంటే మామూలుగా కిలోకు డెబ్బై ఎనభై రూపాయలు ఉండటం మనకు తెలుసు. కానీ ఒక్క ద్రాక్షగుత్తి ఎనిమిదిలక్షల రూపాయల దాకా విలువ చేస్తుందంటే నమ్మగలమా! వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం.
రూబీ రోమన్‌లుగా పిలిచే ఒక రకం ద్రాక్ష జపాన్‌లోని ఇషివాకా ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. మామూలు ద్రాక్షలకు భిన్నంగా ఎరుపు రంగులో పెద్ద సైజులో ఉండే వీటికి పులుపు తక్కువ తీపి ఎక్కువ! ద్రాక్ష గుత్తి మొత్తంగా 700 గ్రాములకు పైగా బరువుండీ, అందులోని ఒక్కో పండూ 20 గ్రాములకన్నా బరువు ఎక్కువగా ఉంటేనే దాన్ని ప్రీమియం రూబీ రోమన్ ద్రాక్షగుత్తిగా పిలుస్తారు. వీటిని చాలా వరకూ వేలం పాట ద్వారా అమ్ముతారు. ఈ మధ్య 24 పండ్లున్న ఒక ద్రాక్ష గుత్తిని ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల దాకా వెచ్చించి కొన్నది ఓ రిసార్ట్ చెయిన్. ప్రపంచంలోనే విలువైన ద్రాక్షలుగా ఈ రకం వాటిని చెబుతారని ప్రత్యేకంగా చెప్పాలా!