ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభయం ఇవ్వకుండా... భయం సృష్టించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ అండ లేకపోగా.. వెనుకబడిన వర్గాలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగుపరచలేకపోయారని విమర్శించారు. రైతులు పండించిన పంటకు ఇస్తానన్న అభయం ఏది అని నిలదీశారు.
రాజధానిపై కక్ష, ప్రశ్నిస్తే కక్ష సాధించటమేనా వైకాపా సాధించిన ఘనతా.. అని గోరంట్ల నిలదీశారు. వైకాపా కుటిల చర్యలు ఎంతో కాలం నిలబడవని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థలను గౌరవించలేని విధంగా ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. సమాజహితం, రాష్ట్రాభివృద్ధి, జన సంరక్షణకు కృషి చేయాల్సిన ప్రభుత్వం... అందుకు వ్యతిరేకంగా వెళ్లడం శోచనీయమని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.