AMARAVATI PADAYATRA : 36వ రోజున మహాపాదయాత్రకు కొవ్వూరు వాసులు వీడ్కోలు పలికితే రాజమహేంద్రవరం ప్రజలు.. రైతులకు స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. కొవ్వూరు నుంచి యాత్ర మెుదలుపెట్టిన అన్నదాతలకు.. మహిళలు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు, వివిధ, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి పాదం కలిపారు.
పశ్చిమగోదావరి వాసులు గామన్ వంతెన వరకూ వచ్చి అన్నదాతలకు వీడ్కోలు పలకగా, తూర్పుగోదారి ప్రజలు అపూర్వరీతిలో సాదరంగా ఆహ్వానించారు. స్థానికుల ఆత్మీయ మద్దతుతో ఎదురెండను సైతం లెక్కచేయక కర్షకులు 6కిలోమీటర్ల వంతెనపై విరామం లేకుండా ముందుకు సాగారు. వంతెనపై ఎక్కడా సేద తీరేందుకు, కాసేపు నిల్చునేందుకు అవకాశం లేకపోయినా.. వృద్ధులు, మహిళలు అంతా మొక్కవోని దీక్షతో కదం తొక్కారు. పడవలకు ఆకుపచ్చ జెండాలు కట్టి మత్స్యకారులు యాత్రకు సంఘీభావం తెలిపారు.