స్వాతంత్రోద్యమకాలంలో అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, తెల్లదొరలను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టిన మహాత్మా గాంధీ ఎప్పటికీ మార్గదర్శే! ఉద్యమకాలంలో ఆ జాతిపిత పాదస్పర్శతో గౌతమీ తీరం పునీతమైంది. 1921–46 మధ్య కాలంలో గాంధీజీ 5 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారని చరిత్ర చెప్తోంది. కోటిపల్లి బస్టాండ్, రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు, వంకాయలవారి వీధి ప్రాంతాల్లో బాపూజీ నడయాడారు. 1946 జనవరిలో చివరిసారి వచ్చిన గాంధీజీ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రసంగించారు.
గాంధీజీ రాజమహేంద్రవరానికి వచ్చినప్పటి జ్ఞాపకాలు ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పదిలంగా ఉన్నాయి. స్వరాజ్య నిధి కోసం 1930లో బాపూజీ రాజమహేంద్రవరం వచ్చినప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు దేవత శ్రీరామమూర్తి తన ఇంటికి ఆహ్వానించి డబ్బు, నగలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాలను దేవత శ్రీరామమూర్తి మనుమడు కోడూరు శ్రీరామమూర్తి ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. మహాత్ముడి జీవిత చరిత్రపై అనేక రచనలు చేశారీయన.