Godarolla kitakitalu programme: కల్మషం లేని స్వచ్ఛమైన మనుషులు, నోరూరించే కమ్మనైన వంటకాలు, చురుకైన చమక్కులకు చిరునామాగా నిలిచింది.. గోదారోళ్ల కితకితల 5వ ఆత్మీయ సమ్మేళనం. యువతీ యువకుల నేటి తరపు ముచ్చట్లు, నాటితరం నెమరువేసుకున్న ఆ పాత మధురాలు.. పండగ వాతావరణాన్ని తలపించాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఆత్మీయులతో రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో జరిగిన ఈ కలయిక కన్నులపండువగా సాగింది.
కొవిడ్ కారణంగా గతేడాది ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడగా.. ఈ సారి గోదారోళ్ల కితకితలు ఫేస్‌బుక్ బృందం సభ్యులు కుటుంబాలతో హాజరయ్యారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆట పాటలతో సందడి చేశారు. ఈ గ్రూపు నిర్వాహకుడు ఈవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆహ్లాదంగా గడిపారు.