ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలగని ముంపు ముప్పు! - గోదావరి వరదల వార్తలు

ఊళ్లను ముంచేసి.. పంటలను పాడుచేసిన గోదారమ్మ శాంతించిందని అందరూ అనుకున్నారు. ఇంతలోనే మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

godavari floods
గోదవరి వరదలు

By

Published : Aug 21, 2020, 10:03 AM IST

వరద వీడనంటోంది.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ఎగువన వర్షాల కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం మరోసారి పెరిగింది. దీంతో శాంతించిన గోదావరి మరోమారు ఉగ్రరూపం దిశగా పయనిస్తోంది. దీనికితోడు ఉత్తర ఒడిశా తీరానికి దగ్గర్లో అల్పపీడన ప్రభావం.. వాయుగుండంగా మారే అవకాశంతో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన మరోమారు ఆందోళన కలిగిస్తోంది. తాజా వాతావరణ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది.

  • ఐదు రోజులుగా నీటిలోనే

ఐదురోజులుగా విలీన మండలాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చింతనూరు, కూనవరం,వి.ఆర్‌.పురం మండలాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలం వద్ద ఉ.6 గంటలకు గోదావరి నీటిమట్టం 54 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • జలదిగ్బంధంలోనే

ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 26 మండలాల్లోని 173 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. 82 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం, కూనవరం మండలాలతోపాటు మన్యంలోని దేవీపట్నంతో పాటు కోనసీమ లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరంలోని లోతట్టు ప్రాంతాలకు ఈ ప్రభావం తాకింది.

  • ఒకరిని పొట్టన పెట్టుకుంది

జిల్లాలో 87,812 మంది ప్రభావితమయ్యారు. 124 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 45,410 మందిని తరలించారు. 1,78,101 ఆహార పొట్లాలు, 6,00,976 నీళ్ల ప్యాకెట్లు అందించారు. 121 వైద్యశిబిరాల్లో సేవలు అందిస్తున్నారు. జిల్లాలో 1902.30 హెక్టార్లలో వరి, 8,922.10 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 95 గృహాలు దెబ్బతినగా.. మరో 26,851 గృహాలు నీట మునిగాయి. ఇప్పటివరకు ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు.

  • నిలిచిన రాకపోకలు

పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం 45 గ్రామాలు జలదగ్బంధంలో ఉన్నయి. పోలవరం మండలంలో 19 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 21, కుక్కునూరు మండలంలో 5 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచినందున ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.

  • దెబ్బతిన్న పంటలు

28 పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు లేక వరద బాధితులు అవస్థలు పడుతున్నారు. ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి వస్తుండటంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ఇదీ చదవండి: గోదావరిని వదలని వరద.. ఇంకా జలజీవనంలోనే బాధితులు

ABOUT THE AUTHOR

...view details