Farmers Problems in Cultivation: పంట రైతు చేతికందాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. భారీ వర్షాలు, వరదలు, కోతల సమయంలో తుపానును నెట్టుకుని చివరికి అందిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న అన్నదాతలకు.. నెలలు గడుస్తున్నా కష్టార్జితం చేతికి అందని పరిస్థితి. ఖరీఫ్ లో ధాన్యం డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో రబీ పంట సాగుకు నానా తంటాలు పడుతున్నారు.చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్నలు సతమతమవుతున్నారు. ఆర్బీకేల్లో ధాన్యం అమ్మినా.. రైతుల వివరాలు పోర్టల్ లోకి ఎక్కక.. మీ భూమి కనిపించడం లేదన్న మాటలు వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం రైతుల దీనగాథ ఇది.
"ఆరు లక్షలు అప్ప తెచ్చి తొలకరి చేను ఊడ్చాను. ప్రభుత్వం నుంచి రావల్సిన సొమ్ము ఇంతవరకూ రాలేదు. అధికారులు రేపు,మాపు అంటున్నారు. భూమి కనిపించడం లేదంటున్నారు. భూమి మీద కాకుండా ధాన్యాన్ని ఎక్కడ పండించాను? చేనును పిండే యాలా ? పురుగుల మందు తాగి చావోలో మీరే చెప్పండి. ఇప్పుడు పంట వేయడానికి కనీసం అప్పు కూడా పుట్టని పరిస్థితి. ఇలాంటి స్థితిలో మేము ఏం చేయాలి? మాకు దారేది.?"
ఇదీ చదవండి :Marijuana Seized : బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా
East Godavari Farmers Problems :తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కొత్తూరుకు చెందిన కౌలు రైతు కేతా సూర్యనారాయణ ఆవేదన ఇది. కౌలుకు వరి సాగు చేసి, అనేక ఒడిదొడుగులు ఎదుర్కొని పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి సుమారు 3 నెలలు గడుస్తున్నా..ఇంత వరకు ఇతని చేతికి పైసా దక్కలేదు. డబ్బులు మాట అటుంచితే.. అమ్ముకున్న పంట, భూమి వివరాలు కనీసం ప్రభుత్వ పోర్టల్ లో కనిపించడం లేదు. సూర్యనారాయణతో పాటు జిల్లాలో ఇంకా ఖరీఫ్ ధాన్యం విక్రయించిన వేల మంది రైతులది ఇదే పరిస్థితి. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోనే నగదు రైతుల ఖాతాలకు చెల్లించాలన్న ప్రభుత్వ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం సేకరణ పోర్టల్ లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలు లేకపోవడంతో వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
" నాలుగెకరాల చేను ఊడ్చాను. 150బస్తాలు అమ్మి 3నెలలు అవుతుంది. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అప్పు కూడా ఎక్కడా దొరకటం లేదు. నా భూమి ఈక్రాప్ లో పడలేదంటున్నారు.అసలు భూమే లేదంటున్నారు. మరి నా భూమి ఏమయిందో తెలియటం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు ?" -వీర్రాజు, కౌలు రైతుకొత్తూరు, తూ.గో. జిల్లా
" పిండి బస్తా ధర 1200 నుంచి 1900 చేశారు. ధాన్యం రేటుకు పిండి బస్తా రేటుకు సంబంధం లేదు. ఆర్బీకే వాళ్లు పిండి బస్తాలకు డబ్బు చెల్లించమంటున్నారు. 21రోజుల తర్వాత వెళ్లినా కూడా ఈక్రాప్ అవ్వలేదు మీ భూమి కనిపించడం లేదు అంటున్నారు. భూమి లేకుండా ధాన్యాన్ని ఎలా కొన్నారు. అప్పులు చేసి పండించినా కనీసం ఖర్చులు కూడా రావడం లేదు. మా పరిస్థితి దీనంగా ఉంది. " -బాపిరాజు, కౌలు రౌతు, మాలపాడు, తూ.గో. జిల్లా