కరోనా రోగుల మృతదేహాల ఖననం విషయంలో ఆందోళన అవసరం లేదని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అదనపు వైద్యాధికారి మూర్తి అన్నారు. మృతదేహాన్ని ఖననం చేయటం వల్ల వైరస్ వ్యాపించదని స్పష్టం చేశారు. అలాగే రోగి మృతదేహంపై ఆరు గంటల తర్వాత వైరస్ నిలిచి ఉండదని వెల్లడించారు.
'ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం. ఆ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అనవసరమైన అపోహలతో నిరసనలు చేయొద్దు. నిర్లక్ష్యంతోనే కొవిడ్ వ్యాపిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి' అని నగరపాలక సంస్థ అదనపు వైద్యాధికారి మూర్తి తెలిపారు.
ఆయన చెప్పిన మరికొన్ని విషయాలు
- కొవిడ్ రోగులు మరణిస్తే... 6 గంటల తర్వాత వారిలో వైరస్ ఉండదు.
- మృతదేహాల నుంచి వెలువడే స్రావాలు ఒంట్లోకి వెళ్తేనే వైరస్ సోకే ప్రమాదముంది. మృతదేహాల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తే చాలు.
- దహనం చేసినప్పుడు వెలువడే పొగ నుంచి వైరస్ వ్యాప్తి చెందదు. చితాభస్మంలోనూ వైరస్ ఉండదు.
- మృతదేహాన్ని భూమిలో ఐదారు అడుగుల లోపల ఉంచుతారు కాబట్టి, ఎలాంటి ప్రమాదం లేదు.