Damerla Rama Rao Art Gallery: దామెర్ల రామారావు 1897 మార్చి 8న రాజమహేంద్రవరంలో జన్మించారు. మేనమామ గాడిచర్ల సత్యనారాయణ వద్ద చిత్రకళలో ఓనమాలు నేర్చుకున్నారు. గోదావరి తీరంలో ఉల్లాసంగా తిరుగుతూ ప్రకృతి అందాల్ని అలవోకగా చిత్రించేవారు. చదువుకు టాటాచెప్పి.. చిత్రకళనే జీవితంగా మలుచుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలకు అప్పట్లో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన.. బ్రిటీష్ దేశస్థుడు ఏజే కూల్డ్రీ.. దామెర్ల రామారావులోని కళా సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించారు. ముంబయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించారు. శిక్షణ తర్వాత 3 నెలల పాటు బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో వంగ చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నారు. మేటి చిత్రకారుడిగా నిలిచారు.
Damerla Rama Rao Art Gallery: సతీమణి సత్యవాణి కూడా చిత్రకారిణే కావడంతో కళలో మరింతగా రాణించారు రామారావు. 1922 నుంచి 1925 వరకు ఆయన అనేక కళాఖండాలకు ప్రాణం పోశారు. బ్రిటీష్ ఎంపైర్, టొరంటో జాతీయ ఎగ్జిబిషన్‌లోనూ వాటిని ప్రదర్శించే అవకాశం దక్కించుకున్నారు. అలా.. అంతర్జాతీయ స్థాయి కళాకారుడిగా కీర్తి గడించిన దామెర్ల రామారావు కేవలం 28 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు. ఆయన పేరుమీద ప్రభుత్వం దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని.. నెలకొల్పంది. సాంకేతిక విద్యా శాఖ పర్యవేక్షిస్తున్న ఈ ఆర్ట్ గ్యాలరీలో.. రామారావు వారసత్వంగా ఇచ్చిన 34 తైల వర్ణాలు, 129 జలవర్ణ చిత్రాలు, పెన్సిల్‌తో గీసిన 250 రేఖాచిత్రాలు, 26 రేఖా చిత్ర పుస్తకాలు పదిలంగా ఉన్నాయి. సుమారు శతాబ్ద కాలం గడిచిపోవడంతో ఆ అద్భుత కళాఖండాల నాణ్యత దెబ్బతింటోంది. వాటి సహజత్వాన్ని కాపాడాలని కళాకారులు కోరుతున్నారు.