Crop Holiday: కోనసీమ.. పచ్చని పైర్లు, ధాన్యరాశులతో తులతూగే ధాన్యాగారం. అక్కడ దశాబ్దాలుగా ధాన్యంసిరులు పండిస్తున్న.. మోతుబరి రైతులున్నారు.పదెకరాలైనా ధైర్యంగా కౌలు చేసే కర్షకులున్నారు. కోనసీమ రైతులకు తుపాన్లు లెక్కకాదు.. కరవుకాటకాలు.. కరెంటు కోతలు కొత్తకాదు. అవరోధాలెన్నున్నా.. వాటిని దాటుకుంటూ పంటపండిస్తారు. బాలరాజుకూడా అలాంటి రైతే. కొన్నేళ్లుగా.. వరి సాగుచేస్తున్న బాలరాజు..ఇక పంటవిరామం ప్రకటించక తప్పడంలేదంటున్నారు.
బాలరాజు ఒక్కరేకాదు.. పచ్చనిపైర్లుచూసి మురిసినపోయిన రైతులెందరో పంట విరామం బాటపడుతున్నారు.ఐ. పోలవరం,.. ముమ్మిడివరం,.. కాట్రేనికోన అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో అనేక మంది అన్నదాతలు.. దుక్కి దున్నలేమని చెప్తున్నారు.
కోనసీమ వ్యవసాయం ఉసురుతీస్తున్న మరో సమస్య.. డ్రైయిన్ల పూడికతీతలో నిర్లక్ష్యం. తొలకరి వచ్చేస్తున్నా ఇంతవరకూ డ్రైయిన్ల పూడిక తీయలేదు. ఒకవేళ పైర్లువేసినా.. వర్షాలకు నిండా మునగడం ఖాయమని రైతులు నాట్లు వేసేందుకు ముందుకురావడంలేదు. కౌలు రైతులూ జంకుతున్నారు.