వరి కోతలపై కరోనా ఎఫెక్ట్... ఆందోళనలో గోదావరి రైతులు ఉభయ గోదావరి జిల్లాలలో రబీ సీజన్లో సుమారు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది. ఈనెల చివరకు వరి కోతకు రానుంది. రైతులు కోతకు సిద్ధమవుతున్న తరుణంలో...కరోనా వైరస్ వ్యాప్తితో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. రైతులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా... క్షేత్రస్థాయి సమస్యలు మాత్రం రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోతలు కోసేందుకు గతంలోలాగా కూలీలపై ఆధారపడకుండా కోత యంత్రాలను ఉపయోగించేందుకు పూనుకున్న.. అందుకు సరిపడ్డా యంత్రాలు అందుబాటులో లేవన్నది వాస్తవం.
చెల్లింపులు ఆలస్యం
గోదావరి జిల్లాలలో రబీ సీజన్ సజావుగా సాగాలంటే సుమారు 1200 పైబడి వరి కోత యంత్రాలు అవసరం ఉంటుంది. ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలంటే రైతులు వెనకాడుతున్నారు. ఖరీఫ్‌లో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి నిన్నమొన్నటి వరకూ చెల్లింపులు జరిగాయి. వాస్తవానికి రైతు ధాన్యం విక్రయించిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలన్న నిబంధన ఉన్నా... చెల్లింపులలో ఆలస్యం జరిగింది. రబీలో అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :లాక్ డౌన్ ఎఫెక్ట్: చేతికొచ్చిన పంట ఇంటికొచ్చే మార్గం లేదు