ప్రతిసారీలాగే పందెం కోడి మళ్లీ గెలిచింది. ఎన్ని బరులు ధ్వంసం చేసినా, ఎన్నెన్ని హెచ్చరికలు చేసినా, ఎంతలా నచ్చజెప్పినా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. స్వయంగా ప్రజాప్రతినిధులు సైతం బరుల వద్దకు వచ్చి కోళ్లను దువ్వి జోరును మరింతగా పెంచారు. దీంతో పోలీసులు సైతం మిన్నకుండిపోవాల్సి వచ్చింది. భోగి రోజున కోట్లలో జూదానికి తెరలేచింది. కోడిపందేలకు తోడు గుండాట, పేకాటలనూ నిర్వహించారు. వేల సంఖ్యలో కార్లలో ఔత్సాహికులు ఈ పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చారు. మామూలు పందేల నుంచి కోసు పందేలు, ముసుగు పందేలనూ ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించారు. కనుమ రోజుతో ముగించకుండా.. మరో రెండు రోజులు అదనంగా నిర్వహించేందుకు అనధికారిక అనుమతులు వచ్చేసినట్లు తెలుస్తోంది.
జోరుగా కోడి పందేలు...
పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం కోడి పందేలు జోరుగా సాగాయి. దెందులూరు, ఆకివీడు, పెదవేగి, కుక్కునూరు, భీమవరం, అయిభీమవరం, వెంప, పాలకొల్లు, లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, మొగల్తూరు, పోడూరు, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో భారీగా పందేలు వేశారు. బరుల్లో రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ పందెం కడుతున్నారు. కొన్నిచోట్ల రూ.2 లక్షల చొప్పున ముసుగు పందేలు నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలవారూ ఒక్కటై బరులు పంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు మొదలయ్యాయి. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దుల్లో భారీగా పందేలకు ఏర్పాట్లు చేశారు. ఈ బరులకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఎక్కడో తప్ప ఎవరూ మాస్క్‌లు ధరించటం లేదు. భౌతికదూరం ఊసేలేదు. శానిటైజర్ల వాడకం అసలు లేదు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచీ పందేలు చూసేందుకు వచ్చారు. రాత్రుళ్లు సైతం పందేలు నిర్వహించేలా విద్యుత్తు దీపాలు, జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు.