ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: 15 రోజుల్లో వరద నష్టం గణన పూర్తి

‘గోదావరి వరదలతో ముంపునకు గురైన కుటుంబాల్లో ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, రూ.2వేల సాయం అందించాం. పశువులకు నోరుంటే అవీ మెచ్చుకునేలా వాటినీ చూసుకోవాలని ఆదేశాలిచ్చి.. ఆదుకున్నాం’ అని సీఎం జగన్‌ చెప్పారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంకలో.. రాజోలు మండలం మేకలవారిపాలెం, తాటిపాకమఠం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు.

బాధితులకు సీఎం పరామర్శ
బాధితులకు సీఎం పరామర్శ

By

Published : Jul 27, 2022, 8:36 AM IST

‘గోదావరి వరదలతో ముంపునకు గురైన కుటుంబాల్లో ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, రూ.2వేల సాయం అందించాం. పశువులకు నోరుంటే అవీ మెచ్చుకునేలా వాటినీ చూసుకోవాలని ఆదేశాలిచ్చి.. ఆదుకున్నాం’ అని సీఎం జగన్‌ చెప్పారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంకలో.. రాజోలు మండలం మేకలవారిపాలెం, తాటిపాకమఠం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. 10, 15 రోజుల్లో పంటనష్టం గణన పూర్తిచేసి.. 2, 3 నెలల్లో పరిహారం అందిస్తామని చెప్పారు. ‘మీరు చెప్పేదాన్నిబట్టే కలెక్టర్‌కు మార్కులిస్తా. ప్రతి ఇంటికీ సరకులన్నీ అందాయా? రూ.2వేలు ఇచ్చారా.. లేదా..? మన కలెక్టరుకు మంచి మార్కులు వేయొచ్చా..?’ అని ప్రశ్నించి, అందకపోతే చేతులు పైకెత్తాలని ప్రజలను కోరారు. తర్వాత అందుకున్నవారూ చేతులు పైకెత్తాలని కోరారు.

ప్రజలకు మంచి జరగాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ‘గతంలో ఏమైనా జరిగితే చంద్రబాబు వెంటనే వచ్చేసి సరిగా పని చేయట్లేదని.. అధికారులను సస్పెండు చేస్తున్నామని అనేవారు. అవన్నీ పేపర్లలో.. టీవీల్లో వేసేవారు. ముఖ్యమంత్రి వెంటనే వచ్చేస్తే కలెక్టర్లు, అధికారులందరూ ఆయన చుట్టూ తిరిగి.. ఫొటోలకు పోజులిచ్చేవారు. ఓ పెద్దమనిషి రెండు, మూడు రోజుల కిందట ఇక్కడ తిరిగారు. తమకు రేషన్‌, రూ.2వేలు అందలేదన్న ఒక్కరినీ చూపించలేకపోయారు’ అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ పనులు అంత పారదర్శకంగా, సమర్థంగా జరుగుతున్నాయని చెప్పారు.

.

శభాష్‌ కలెక్టర్‌

కలెక్టర్లు, జేసీలు, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది... అందరూ ప్రజలకు మంచి చేయాలన్న తపనతో పని చేశారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. శభాష్‌ కలెక్టర్‌ అని హిమాన్షు శుక్లాకు కితాబిచ్చారు. ‘కలెక్టర్ల చేతుల్లో వనరులు పెట్టి.. అందరికీ మంచి జరగాలని చెప్పి.. వారం, పది రోజులు గడువు ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చి అడిగితే ఏ ఒక్కరి నోటి నుంచీ తమకు సాయం అందలేదన్న మాట రాకూడదని చెప్పి గట్టిగా అడుగులేశాం’ అని జగన్‌ తెలిపారు.

.

ట్రాక్టరుపై వెళ్లి.. బురదలో నడిచి..

ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభ సమయంలో జోరువాన కురిసింది. హెలికాప్టర్‌ దిగిన సీఎం.. అక్కడి నుంచి వశిష్ఠ గోదావరిపై పంటులో రేవు దాటి.. ట్రాక్టరుపై గ్రామాలకు చేరుకున్నారు. తర్వాత బురదలోనే నడుస్తూ ఇంటింటి దగ్గర ఆగి బాధితుల కష్టాలు తెలుసుకుని వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్‌, తానేటి వనిత, జోగి రమేష్‌, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా, పొన్నాడ సతీష్‌ కుమార్‌, జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.

రోడ్లు చూశా.. సమస్య పరిష్కరిస్తా

పి.గన్నవరం మండలం బూరుగులంకలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా రోడ్లు బాగాలేవని గ్రామస్థులు వెనుక నుంచి కేకలు వేశారు. రోడ్లు చూశానని, అంచనాలను తయారు చేయించి సమస్యను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక గ్రామాల రాకపోకలకు వీలుగా వశిష్ఠ గోదావరి నదీపాయపై వంతెన పనులను నెలన్నరలో ప్రారంభిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details