దిశ చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయని ఆయన నిలదీశారు. రాజమహేంద్రవరంలో ఒక దళిత బాలికను 4 రోజులపాటు నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారానికి పాల్పడి చివరికి నిందితులే బాధిత బాలికను పోలీసు స్టేషన్ వద్ద వదిలేసి పోలీసులనే సవాల్ చేశారంటే... రాష్ట్రంలో నేరగాళ్లు ఎంతగా పేట్రేగిపోతున్నారో చూడాలని మండిపడ్డారు.
బాలిక అత్యాచార ఘటనపై చంద్రబాబు ఆగ్రహం... దిశచట్టం ఏమైందని ప్రశ్న? - దిశ చట్టంపై చంద్రబాబు కామెంట్స్
దిశ చట్టం చేశామని కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకున్న వైకాపా ప్రభుత్వం... ఆ చట్టం అమలులో పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఓ దళిత బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, పోలీసు స్టేషన్ ముందే వదిలిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో మహిళలకు భద్రతలేదని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా యేర్పేడు మండలంలో దళిత బాలిక, నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లెలో మరో బాలిక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకో దళిత బాలిక, గుంటూరులో ముస్లిం బాలిక, నెల్లూరులో మహిళపై అత్యాచారం.. ఇప్పుడీ దళిత బాలిక... 14 నెలల్లో 400 పైగా అత్యాచారాలు, 16 గ్యాంగ్ రేప్ లు జరిగాయన్నారు. నెల్లూరులో మహిళా ఎంపీడీవోపై, చిత్తూరులో దళిత మహిళా డాక్టర్ పై దౌర్జన్యాలు, మాస్క్ పెట్టుకోమన్న మహిళా ఉద్యోగినిపై ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతికదాడి...ఇవన్నీ ఏపీలో మహిళలపై అరాచకాలకు పరాకాష్ఠ అని చంద్రబాబు మండిపడ్డారు. పాలకులు స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తే దాని దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని, బడుగు బలహీన వర్గాల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.
ఇదీ చదవండి :'దిశ చట్టం... ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి?'