NITIN GADKARI : రాష్ట్రంలో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 129 కి.మీ విస్తీర్ణంలో సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టనున్న 2, 4 వరుసల 3 జాతీయ రహదారులు, 5 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇదే వేదిక నుంచి శంకుస్థాపన చేశారు.
‘ఏపీకి రానున్న 3 నెలల్లో రూ.3వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి భూములు కేటాయిస్తే లాజిస్టిక్ పార్కులు ఇస్తాం. భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు 6లైన్ల హైవే.. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం- వేమగిరి- కాకినాడ కెనాల్ రోడ్డును కాకినాడ పోర్టుకు అనుసంధానం చేస్తాం. సముద్ర రవాణాలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలూ సౌర, విద్యుత్తు, బయోడీజిల్ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్ బ్యాంకు ద్వారా పచ్చదనం అభివృద్ధిచేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే’ అని గడ్కరీ పేర్కొన్నారు.
"దేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రం. ఎక్కువ సముద్రతీరం ఉన్న రాష్ట్రం. నేను నౌకాయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. విశాఖపట్నం అభివృద్ధికి చాలా నిధులు కేటాయించాను. అప్పట్లో రెండు ఓడరేవుల విషయంలో ఇక్కడి ప్రజలకు వివాదం ఉండేది. కొందరు ప్రజలు మచిలీపట్నం ఓడరేవు మంజూరు చేయాలని, కొందరు నాగపట్నం ఓడరేవు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసేవారు. కానీ నేను రెండు ప్రాజెక్టులూ మంజూరు చేశాను. ఎందుకంటే రెండు ఓడరేవులూ ముఖ్యమే. నౌకాయానం చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఓడ రేవులు ఇంజిన్‌లా పనిచేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడానికి ముందుకొస్తే ఏపీలో లాజిస్టిక్ పార్కు అభివృద్ధి చేస్తాం" -నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల వివరాలివి..
* వాకలపూడి- ఉప్పాడ- అన్నవరం ఎన్‌హెచ్- 516ఎఫ్ రహదారిపై రూ.1,345 కోట్లతో 40.62 కి.మీ లైనింగ్ పనులు
* సామర్లకోట- అచ్చంపేట జంక్షన్ వరకు ఎన్‌హెచ్- 516ఎఫ్ రహదారిపై రూ.710 కోట్లతో 12.25 కి.మీ లైనింగ్ పనులు
* రంపచోడవరం- కొయ్యూరు ఎన్‌హెచ్- 516ఈ రహదారిపై 70.12 కి.మీ పొడవున రూ.570 కోట్లతో రెండు లైన్ల నిర్మాణం