పోలవరం ప్రాజెక్ట్ వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమహేంద్రవరంలో డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించారనే విషయాన్ని తాను ధైర్యంగా చెప్పగలనన్న ఆయన.... మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే ఆ పనిని భాజపానే చేస్తుందని తెలిపారు.
కోర్టు వివాదాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని వీర్రాజు విమర్శించారు. చంద్రబాబు... పోలవరం నిర్మాణ వ్యయం 48 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని గతంలో జగన్ ఆరోపించారని... ప్రస్తుతం సీఎం జగన్ ఆ వ్యయాన్ని తగ్గించగలరా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా భాజపా వల్లే అని వ్యాఖ్యానించారు. భాజపా సంస్థాగత అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.