బాలినేనికి దామచర్ల సవాల్ - tdp
తనపై విమర్శలు చేస్తున్న బాలనేనిని.. దమ్ముంటే అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు రావాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ సవాల్ విసిరారు. 'మైండ్ గేమ్ నీకే కాదు నాకు వచ్చు' అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
"15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒంగోలుకు నువ్వు ఏమి చేశావో ...నాలుగున్నరేళ్లలో నేను ఏంచేశానో జనం మధ్యలో చర్చించుకుందాం రా" అని మాజీ ఎమ్మెల్యే బాలినేనికి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సవాల్ విసిరారు. ప్రకాశంజిల్లా ఒంగోలులో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలు హైదరాబాద్ లో దాక్కొని ఇవాళ రాజకీయం చేయడానికి మాయమాటలు చెప్తూ నియోజకవర్గంలో తిరుగుతున్నాడని బాలినేనిని విమర్శించారు. ఒకరిద్దరు నాయకులను కొనుగోలు చేసి పార్టీలో చేర్చుకొని మైండ్ గేమ్ ఆడాలని బాలినేని శ్రీనివాసులరెడ్డి అనుకుంటున్నారని తమకు కూడా మైండ్ గేమ్ ఆడటం తెలుసు అన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చానని ... ఆభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు.