చూశారుగా.. బండి జర భద్రంగా నడపాలి అనిపించేలా ఉన్న ఈ రోడ్లని..! కాసింత దూరం వెళ్తే చాలు.. కూసాలు కదులుతాయనిపించేలా ఉన్నాయ్ కదా..! నెల్లూరులో ఉన్నాయ్ ఈ రోడ్లన్నీ. ఆర్టీసీ డిపో దగ్గర్లోని ఫతేఖాన్ పేట నుంచి నగరం నడిబొడ్డున ఉన్న తంబరంవారి వీధి వరకూ.. వర్షం కురిస్తే ప్రయాణమే ఒక పరీక్ష..
ప్రతి గల్లీలో గండం... ఆ మార్గంలో ప్రయాణమే ఒక పరీక్ష!
దాదాపు 9 లక్షల మంది జనాభా ఉన్న నగరమది..! వాహనదారులకు ప్రతి గల్లీలోనూ గండమే.! కొన్నిచోట్ల వేగంగా వెళ్తే... కంకర రాళ్లు గింగిర్లు తిరుగుతాయ్.! కొన్నిసార్లు ఇళ్లలోకీ ఎగిరొస్తాయ్. ఒక్కో అడుగు వేయాలంటే పాదచారులకు ప్రహసనమే..! ఇంతటి దుర్భరమైన రోడ్లున్న ఆ నగరమేదో ఓసారి చూద్దాం.
నెల్లూరులో 54 డివిజన్లు ఉన్నాయి. ఇంత పెద్ద నగరంలో మైపాడు రోడ్డు కీలకమైనది. ఆరు కిలోమీటర్ల దూరంలో.. రోడ్డుకు ఇరువైపులా ఏడు డివిజన్లు ఉన్నాయి. నిత్యం వేలాదిమంది తిరిగే ఈ రహదారులు.. చాలాచోట్ల పాడయ్యాయి. మూడేళ్లుగా రోడ్లు బాగుచేస్తామని చెప్పడమేగానీ.. మరమ్మతులు ముందుకు కదలట్లేదు.
నగరంలోని చాలారోడ్లలో అన్నీ గుంతలమయమే. తాంబరం వీధి నుంచి పోలీస్ క్వార్టర్స్ సమీపం వరకు.. గోతుల లెక్క అపరిమితం. అదనంగా దుమ్ము అనారోగ్యానికి కారణమవుతోందని జనం వాపోతున్నారు. ఆటోలు నడుపుతూ సంపాదించే డబ్బు.. వాహనం మెయింటెనెన్స్‌కే సరిపోతోందని.. ప్రజలు అంటున్నారు.
నెల్లూరులో రోడ్ల మరమ్మతులకు నగరపాలక సంస్థ కనీసం రూ.వందకోట్లు కేటాయించాల్సి ఉంది. 2022-23 బడ్జెట్‌లో కేవలం 7 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం సుమారు కోటి రూపాయల విలువైన పనులు మాత్రమే జరుగుతున్నాయి.