తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకు నిదర్శనమే గతంలో లేని విధంగా మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటని స్పష్టం చేశారు. నెల్లూరులో జరిగిన మత్స్యకార సంక్షేమ సమితి సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేశంలో అయిదు మోడల్ ఫిషింగ్ హార్బర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వాటిలో ఒకటి విశాఖలో ఏర్పాటు కానుందని వెల్లడించారు. కేంద్రం తీసుకొస్తున్న మత్స్యకార బిల్లుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొవిడ్ సమయంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్రం 20వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతేగాక మత్స్యకార గ్రామాలను దత్తత తీసుకొని, ఆయా గ్రామాలను ఏడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మత్స్యకార సంక్షేమ సమితి నాయకులు వారి సమస్యలను మంత్రికి విన్నవించారు.
నెల్లూరు నగరం గుండ్లపాలెం దగ్గర ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర యూనిట్‌ను కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి మురుగన్ సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మత్స్య ఉత్పత్తులను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఫిష్ ఆంధ్రకు సంబంధించిన వివరాలను మత్స్యశాఖ అధికారులు కేంద్ర మంత్రికి తెలియజేశారు. పలు విభాగాలను పరిశీలించిన అనంతరం మంత్రి మొక్క నాటారు.
ప్రభుత్వం నాశనం చేస్తోంది...