కండలేరు జలాశయంలో ముగ్గురు గల్లంతు.. రెండు కుటుంబాల్లో విషాదం - కండలేరు జలాశయంలో ముగ్గురు గల్లంతు
21:18 April 12
ముగ్గురు గల్లంతు
నెల్లూరు జిల్లా కండలేరు జలాశయాన్నీ చూసేందుకు వచ్చిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం నీటిలో దిగి సరదాగా అడుకుంటుండగా.. ఒక్కసారిగా ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కథనం మేరకు.. చెన్నైకి చెందిన బోసు, పొన్ను కుమార్ కుటుంబాలు గత ఐదు సంవత్సరాలుగా చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లికి వలస వచ్చి చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. మంగళవారం సాయంత్రం కండలేరు జలాశయాన్నీ చూసేందుకు వచ్చిన పొన్ను కుమార్ (37), అతని కుమార్తె పవిత్ర (6), బోసు కుమార్తె లక్ష్మీ (11) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ప్రమాదాన్ని గమనించిన బోసు కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న జాలర్లు వచ్చి వెతికినా వారి ఆచూకీ లభ్యం కాలేదు.
విషయం తెలుసుకున్న పొదలకూరు సీఐ సంగమేశ్వర రావు, కండలేరు ఎస్సై అనూష, స్థానిక వీఆర్వో రాజగోపాల్ నాయుడులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గజ ఈత గాళ్ల సహాయంతో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. అందులో చీకటిపడడంతో మళ్లీ బుధవారం ఉదయం గాలింపు చేపట్టగా.. మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి: Old Women Died: వృద్ధురాలి ప్రాణం తీసిన చిన్న వివాదం.. వైకాపా నాయకులే కారణం!