ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరదతో పెన్నా తీరం కష్టాలమయం - penna river news

పెన్నా నది పరీవాహక ప్రాంతంలో యథేచ్ఛగా సాగిన ఆక్రమణలు... నానాటికీ తగ్గుతున్న నదీ గర్భం...మాయమైన కరకట్టలు.. తప్పిన వరద అంచనాలు... ఏళ్ల తరబడి నెలకొన్న నిర్లక్ష్యం....పెన్నా నది పెను విపత్తుకు కారణాలయ్యాయి.

The Penna coast is submerged by floodwaters
వరదతో పెన్నా తీరం కష్టాలమయం

By

Published : Nov 30, 2020, 8:43 AM IST

దశాబ్దాల తరబడి ఈ పరిస్థితులు కొనసాగుతున్నా ఎవ్వరూ దృష్టి పెట్టకపోవడంతో వరద ముంచెత్తింది. మెరుపు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జలాశయాల వద్ద భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరు నగరం, ఇతర చిన్న చిన్న పట్టణాలు, అనేక గ్రామాలు నీట మునిగాయి. రాత్రికి రాత్రి కాలనీల్లోకి వరద రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

పరీవాహక ప్రాంతంలో విస్తరించిన సాగు

నెల్లూరు జిల్లాలో దాదాపు 11 మండలాల్లో 150 కిలోమీటర్ల మేర పెన్నా నది ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతంలో గతంలో అనేక ప్రభుత్వాలు అసైన్డ్‌ పట్టాలిచ్చి సాగుకు అవకాశం కల్పించాయి. అనధికారిక విద్యుత్తు కనెక్షన్లు పొంది, బోర్లు కూడా తవ్వుకుని, కౌలుకు ఇచ్చి మరీ వ్యవసాయం చేయిస్తున్నారు. నదీ పరిరక్షణ చట్టం ప్రకారం గడ్డిపరక కూడా నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించకూడదు. దాన్ని పూర్తిగా విస్మరించి పెద్ద ఎత్తున సాగు చేయడంతో పెన్నా స్వరూప, స్వభావాలే మారిపోయాయి. తీరం మెరకగా మారింది. ఇళ్లు, భవనాలు కూడా నిర్మించడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి. డ్రెయిన్ల ద్వారా వచ్చే వర్షపు నీరు వెనక్కు తన్నడంతో ముంపు సమస్య తీవ్రమవుతోంది.

జలాశయాలు మరింత ఖాళీ చేసి ఉంటే...

ఇటీవలి వర్షాలకు సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. సోమశిలలో 76 టీఎంసీలు, కండలేరులో 60 టీఎంసీల నీరు చేరింది. ఈ సమయంలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు నాలుగు రోజుల ముందు నుంచే అతి భారీ వర్ష హెచ్చరికలు వచ్చాయి. ఇదంతా పెన్నా పరీవాహకమే. ఈ నేపథ్యంలో సోమశిలలో 10 టీఎంసీలకు పైగా ఖాళీ చేసి ఉంటే వరద నియంత్రణ సాధ్యమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఎస్‌.ఈ కృష్ణారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ ‘వరద రావడానికి ముందే 5 టీఎంసీలకు పైగా ఖాళీ చేశాం. పింఛా ప్రాజెక్టులో కరకట్ట తెగడం, అన్నమయ్యపై ఒత్తిడి పెరగడంతో అనూహ్యంగా మరో 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు అధికంగా వచ్చింది...’ అని పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుంచి ఇంతవరకు ఈ స్థాయిలో వరద నీటిని విడుదల చేయలేదు. గతంలో అత్యధికంగా 3.60 లక్షల క్యూసెక్కులు రాగా.. ప్రస్తుతం 3.71 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదిలారు. ఆ ప్రభావం సంగం బ్యారేజిపై పడింది.

ఆ ఇసుక బస్తాలతో ఆటంకం..!?
సంగం వద్ద కూడా అంచనాలకు మించి వరద పోటెత్తింది. సోమశిల నుంచి విడుదలైన ప్రవాహానికి మధ్యలో ఇతర వాగుల నీరు కూడా కలవడంతో దాదాపు 4 లక్షల క్యూసెక్కులు చేరింది. సంగం వద్ద 1946లో 4.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తే ఆనకట్టకు ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. పాత ఆనకట్టకు 34 ఫాలింగు షట్టర్లు ఉన్నాయి. ప్రవాహం నిర్దిష్ట స్థాయిలో వస్తే ఆ షట్టర్లు వాటంతట అవే కిందకు వాలిపోయి నీరు నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్నాలో సాగిపోతుంది. ఇటీవల బెజవాడ గోపాలరెడ్డి కాలువకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవాహాన్ని నిలిపి ఉంచేందుకు వీలుగా ఇసుక బస్తాలు వేస్తున్నారు. వాటి వల్ల ఫాలింగ్‌ షట్టర్లు సరిగా పని చేయక వరద వెనక్కు పోటెత్తింది. దీనిపై అధికారులతో మాట్లాడితే...‘ బెజవాడ గోపాలరెడ్డి కాలువకు నీళ్లు ఇవ్వాలంటే ఆ ఇసుక బస్తాలు అవసరం. అవి లేకుంటే నీళ్లు పంపడం కష్టం. సంగం కొత్త బ్యారేజి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇలాంటి ఏర్పాటు అవసరం...’ అని వివరిస్తున్నారు.

ఆక్రమణలపై ఇప్పటికీ వివరాలు లేవు

పెన్నా నదీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలపై అధికారుల వద్ద ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుత వరద పరిస్థితుల్లో తాజా సర్వేకు నిర్ణయించినట్లు జలవనరులశాఖ అధికారులు చెప్పారు. తొలుత డ్రోన్‌ ద్వారా సర్వే చేసి ఆ తర్వాత పక్కాగా లెక్కలు తీసి ఆక్రమణల జాబితా రూపొందిస్తామంటున్నారు.

ఇదీ చదవండి:

వంతెన కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న గన్నవరం గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details